CM Jagan Neglect Bhairavani Tippa Project in Anantapuram District : భైరవాని తిప్ప ప్రాజెక్టు సంబంధించిన భూ సేకరణ కార్యక్రమం యుద్ధప్రతిపాదికన జరుగుతుందని 2021 జులై 8న రాయదుర్గం నియోజవర్గంలో రైతు దినోత్సవ సభలో సీఎం జగన్ ఊదరగొట్టారు. ప్రాజెక్ట్ సంబంధించి 1400 ఎకరాలకు గాను 500 ఎకరాల భూసేకరణ పూర్తి అయ్యిందని రైతన్నలకు వివరించారు. మిగిలిన భూమిని కలెక్టర్, ఇతర అధికారుల ద్వారా 60 రోజుల్లో సేకరించి ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులను శర వేగంగా మొదలుపెడతామని జిల్లా వాసులను నమ్మించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే చెప్పడంతో తమ ప్రాంతానికి ఇంకా తాగునీరు, సాగునీటి సమస్య ఉండదని ప్రజలు ఆనందించారు. కానీ సీఎం జగన్ వారి ఆశలపై నీళ్లు చల్లారు. జగన్ సీఎం స్థాయిలో జిల్లాలో రెండు సార్లు పర్యటించినా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా భైరవాని తిప్ప ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. మాట తప్పాను, మడమ తిప్పాను అంటునే జిల్లా వాసులకు నమ్మించి నట్టేట ముంచారు.
అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గం అత్యంత దుర్భిక్ష ప్రాంతం. తీవ్ర వర్షాభావంతో అక్కడి ప్రజలకు పంటలు లేక, ఉపాధి మార్గాలు కరవై ఉపాధి కోసం రైతులను, వ్యవసాయ కూలీలు ఏడాది పొడవునా వలసలు వెళ్లేవారు. వీరిని ఆదుకోవటానికి దాదాపు 50 ఏళ్ల క్రితం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలాలకు మధ్య గుమ్మగట్ట సమీపంలో వేదవతి నదిపై బైరవాని తిప్ప జలాశయాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రెండు నియోజకవర్గాల్లో దాదాపు 12,800 ఎకరాలకు సాగునీరు అందేది. బీటీ ప్రాజక్టు ఎగువన కర్ణాటక రాష్ట్రంలో అక్రమ ప్రాజక్ట్లు నిర్మించటం వల్ల రెండున్నర దశాబ్దాలుగా జలాశయంలోకి నీటి చేరిక లేదు. దీంతో బీటీ ప్రాజక్టును మృత ప్రాజక్టుల జాబితాలో చేరిపోయింది.
2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అక్కడి పరిస్థితులను చూసిన అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒప్పించి హంద్రీ నీవా కాలువ నుంచి కృష్ణా జలాలను బీటీ ప్రాజెక్టుకు తరలించే ప్రతిపాదనలకు కార్యరూపం తీసుకొచ్చారు. అప్పట్లో చంద్రబాబు సర్కారు రూ.968 కోట్లను మంజూరు చేసింది. ఓ వైపు కాలువ తవ్వకానికి భూసేకరణ, మరోవైపు కాలువ నిర్మాణ పనులు వేగంగా చేశారు. ఇంతలోనే 2019లో ఎన్నికలు రావడం, జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బైరవాని తిప్ప ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది. కాలువ తవ్వడానికి భూములిచ్చిన రైతులకు పరిహారం ఇవ్వడంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలం కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.