ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలా మాట్లాడాలో ముందే శిక్షణ - భజనలా ప్రజలతో సీఎం జగన్​ ముఖాముఖి - CM Jagan sabha in erraguntla - CM JAGAN SABHA IN ERRAGUNTLA

CM Jagan interact With Public in Erraguntla: యర్రగుంట్లలో సీఎం జగన్​ నిర్వహించిన సభ భజనగా మారింది. జగన్​తో ఏం మాట్లాడాలో ప్రజలకు వైసీపీ నేతలు ముందుగానే శిక్షణ ఇచ్చారు. సమావేశంలో మొత్తం జగన్​ను పొగుడుతూ, ప్రభుత్వ పథకాలతో తమ జీవితాలు పూర్తిగా మారిపోయినట్లుగా ప్రజలతో నేతలు మాట్లాడించారు. సీఎం జగన్​కు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్న రైతులపై వైసీపీ నేతలు దాడి చేశారు. సీఎం సభకు జనాల్ని తరలించేందుకు వందల కొద్దీ బస్సులను వినియోగించుకున్నారు.

CM Jagan interact With Public in Erraguntla
CM Jagan interact With Public in Erraguntla

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 10:39 AM IST

CM Jagan Interact With Public in Erraguntla: నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం యర్రగుంట్లలో ప్రజలతో సీఎం జగన్‌ ముఖాముఖి కాస్తా భజన సభగా మారిపోయింది. నేతలు గ్రామస్థులతో ముఖాముఖి అని చెప్పి వారు ఎలా మాట్లాడాలో ముందే సిద్ధం చేశారు. జగన్​ అక్కడకు వచ్చిన వెంటనే భజన మొదలుపెట్టారు. మాట్లాడిన వారందరూ జగన్‌పై పొగడ్తలతోనే సరి పెట్టారు. ఎర్రగుంట్లలో నిర్వహించిన సమావేశం మొత్తం జగన్​ను పొగుడుతూ, ప్రభుత్వ పథకాలతో తమ జీవితాలు పూర్తిగా మారిపోయినట్లు ప్రజలతో మాట్లాడించారు.

వైఎస్సార్సీపీ సేవలో ఆర్టీసీ బస్సులు - గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయాణికుల అవస్థలు

ఐప్యాక్‌ సభ్యుల ఆధ్వర్యంలో ముందే పలువురు లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చారు. కొందరు మాట్లాడిన తీరు చూస్తే బట్టీకొట్టి వచ్చినట్లు అర్థమవుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేవారిపై కఠిన ఆంక్షలు విధించారు. పాస్‌ ఉన్నవారు తప్ప వేరెవ్వరూ అక్కడికి రాకుండా చేశారు. పాస్‌లు ఉన్నవారిని సెల్‌ఫోన్లు, పెన్నులు, పుస్తకాలు వంటివి తీసుకెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు. మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా ముఖాముఖిని గుట్టుగా నిర్వహించారు. ప్రాంగణం మొత్తానికి పరదాలు కట్టేసి లోపల ఉన్నవారికి తప్ప బయట ఉన్నవారికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ యర్రగుంట్లలో 1,496 ఇళ్లు ఉండగా అందులో 1,391 ఇళ్ల వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరిందని చెప్పారు. అన్ని పథకాల ద్వారా రూ.48.74 కోట్ల ప్రయోజనం కలిగిందని ఆయన అన్నారు. తర్వాత ప్రజలతో సీఎం ముఖాముఖి ప్రారంభమైంది. తన కుమార్తెకు కళ్లు కనిపించవని పింఛను అందట్లేదని సీఎం సమక్షంలో ఒకరు రోదించగా కారణాలు తెలుసుకుంటానని ఆయన సమాధానమిచ్చారు.

ఆరున్నరేళ్ల తర్వాత మళ్లీ - జగన్​ బస్సుయాత్రపై ప్రజల ఆగ్రహం - CM Jagan Bus Yatra

అంతా వైసీపీ కార్యకర్తలే :యర్రగుంట్లకు చెందిన పుష్పలత సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. సంక్షేమ పథకాలతో లాభం పొందానని వచ్చే ఐదు సంవత్సరాలు జగనే సీఎం కావాలని అన్నారు. గోవిందపల్లెకు చెందిన వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు వాణి సాధారణ పౌరురాలిలా మాట్లాడారు. మహిళా సాధికారత జగన్‌తోనే సాధ్యమని ఈ పాలనలో పేదరికం, అవినీతి తగ్గుతున్నాయని ఆమె అన్నారు. ఆళ్లగడ్డకు చెందిన అపర్ణ, ప్రసాద్‌ అనే దివ్యాంగ దంపతులు తమను తాము జగన్‌ అభిమానులుగా పేర్కొంటూ ప్రసంగించారు. తామిద్దరికి నెలకు రూ.6 వేల పింఛను అందుతోందని, జగన్‌ చిత్రపటాన్ని గీసి చూపించారు.

చంద్రబాబు సభకు ఎందుకు వెళ్లావు ? - టీడీపీ కార్యకర్తపై వైసీపీ వర్గీయుడి దాడి

రైతుపై వైసీపీ నేతల దాడి: సీఎం జగన్​కు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్న రైతులపై వైసీపీ నాయకులు దాడి చేశారు. సభా స్థలానికి ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపైకి ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ వచ్చారు. ఆమె సీఎంకు రైతుల సమస్యలపై వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించగా పోలీసులు వెళ్లినివ్వకుండా అడ్డుకున్నారు. తన స్థానంలో యర్రగుంట్ల రైతులు వినతిపత్రం ఇస్తారనడంతో పోలీసులు సమ్మతించి ఐదుగురికి అనుమతిచ్చారు. రైతులు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. నేతల అనుచరులు ఒక రైతుపై దాడి చేశారు. జగన్​ బస్సు యాత్ర సందర్భంగా నంద్యాల వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లించారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ అవాంతరాలు తలెత్తి ఎండలో ప్రజలు నరకం అనుభవించారు.

నంద్యాల సభకు జనాల్ని తరలించేందుకు కర్నూలు జిల్లాలోని వందల ఆర్టీసీ బస్సులతోపాటు తిరుపతి, చిత్తూరు, అలిపిరి, ప్రొద్దుటూరు, కడప, అనంతపురం తదితర సుదూర ప్రాంతాల్లోని బస్సులనూ తీసుకొచ్చారు. దీంతో బస్సులు లేక రాయలసీమలోని వేలమంది ప్రయాణికులు బస్టాండ్లలో నిరీక్షించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వెచ్చించే ప్రతి పైసాకు లెక్క చూపించాలనే స్పృహ లేకుండా వేల బస్సులను జనాలను తరలించడానికి ఉపయోగించారు.

సీఎం సిద్ధం సభకు ఆర్టీసీలు సంసిద్ధం- ప్రయాణికుల సందిగ్దం

ABOUT THE AUTHOR

...view details