Amaravati Capital Works Restarts :అమరావతి పునఃనిర్మాణం చరిత్ర తిరగరాసే తరుణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేవతల రాజధాని అమరావతి పేరు ఏపీ రాజధానికి తొలుత సిఫార్సు చేసింది రామోజీరావని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇక విధ్వంసం పోయింది, నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థలు, హోటళ్లు, ఆసుపత్రులు ఇతరత్రా అన్ని సౌకర్యాలు అమరావతికే వస్తాయన్నారు. ఒకప్పుడు ఇద్దరికంటే ఎక్కువ జనాభా ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన తెచ్చామని, ఇప్పుడు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులనే నిబంధన తీసుకురావాలేమో అని సీఎం చంద్రబాబు చమత్కరించారు.
రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని పనులను ప్రభుత్వం మొదలు పెట్టింది. తుళ్లూరు మండలం లింగాయపాలెం-ఉద్దండరాయినిపాలెం వద్ద పనులను సీఎం ప్రారంభించారు. భవన ప్రాంగణంలో సీఎం, మంత్రి నారాయణ పూజా కార్యక్రమం నిర్వహించారు. 160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్డీఏ చేపట్టింది. ఈ నెల 16వ తేదీన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణాన్ని 2017లో ప్రభుత్వం ప్రారంభించింది. మొత్తం 3.62 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7 భవనాన్ని 2 లక్షల 42 వేల 481 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేయనుంది. అదనంగా పార్కింగ్, ల్యాండ్ స్కేపింగ్ 2.51 ఎకరాల విస్తీర్ణం, భవనం నిర్మాణం కోసం ఇప్పటివరకూ 61.48 కోట్ల ఖర్చు పెట్టింది. ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ సిస్టమ్స్, ఇతర వర్క్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి. బ్యాలెన్స్ పనుల పూర్తికి 160 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.
రాజధాని నిర్మాణం కోసం సాంకేతిక సమస్యలన్నీ పరిష్కరించాం: మంత్రి నారాయణ
స్వర్గం మాదిరి అమరావతి అభివృద్ధి: రాజధానికి అమరావతి పేరుకోసం రామోజీరావు ఎంతో పరిశోధించి ప్రతిపాదించిన పేరుకు అందరి ఆమోదం లభించిందని చంద్రబాబు అన్నారు. పేరుకు తగ్గట్టే స్వర్గం మాదిరి అమరావతిని సుందరంగా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. అమరావతి ముంపు ప్రాంతం అని జగన్ విష ప్రచారం చేస్తే, తాజాగా బెంగళూరులో అతనుండే ఎలహంకా ప్రాంతం మునిగిందని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి నేడు మళ్లీ ప్రాణప్రతిష్ట జరిగిందని సీఎం తెలిపారు.
అమరావతి స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్ట్: 121వ రోజు మళ్లీ ఇక్కడికి వచ్చి పనులు ప్రారంభించిన ఇదే భవనాన్ని ప్రారంభిస్తానన్నారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. రైతులు, ప్రజల్లో ఇంకా మార్పు వచ్చి ఎవరు వచ్చినా అతిథిగా గౌరవించాలని సీఎం ఆకాంక్షించారు. అందరూ అనుకున్నట్లు తాను హైదరాబాద్లో డబ్బు ఖర్చు చేయలేదని, సంపద సృష్టికి బీజాలు వేశానని తెలిపారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతుందని వైఎస్సార్సీపీ విష ప్రచారం చేసిందని మండిపడ్డారు. అమరావతి స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్ట్ అని అంతా గ్రహించాలని అన్నారు. నగరాభివృద్ధికి ప్రభుత్వ డబ్బుతో సంబంధం లేదని చంద్రబాబు స్పష్టంచేశారు.