Chandrababu Speech in Tiruchanur : కూటమి సర్కార్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తిరుపతిలోని తిరుచానూరులో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఏజీఅండ్‌పీ సంస్థకు చెందిన గ్యాస్ సరఫరాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఓ వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలిగించి స్వయంగా టీ చేసి అందించారు. వినియోగదారుడి కుటుంబసభ్యులతో కలిసి తేనీరు సేవించారు. పైప్‌లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడా గురించి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం చంద్రబాబు పర్యావరణహిత ద్విచక్రవాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు 2014-2019 మధ్య ప్రణాళిక వేశామని ముఖ్యమంత్రి తెలిపారు. 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఇందుకోసం 5 కంపెనీలను సంప్రదించినట్లు వివరించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర దిశగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుతుందన్నారు.
"భవిష్యత్‌లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి కానున్నాయి. మా రాష్ట్రానికి పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయి. ఏపీకి హైవేలు, విశాల తీరప్రాంతం, పోర్టులు, విమానాశ్రయాలు ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. జపాన్ కంపెనీల సాయంతో శ్రీసిటీని విస్తరిస్తాం. కాలుష్యరహిత సమాజం కోసం కృషి చేస్తాం. తొలుత రాయలసీమ జిల్లాలకు పైప్‌లైన్ గ్యాస్ సరఫరా చేస్తాం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి