CM Chandrababu on 150 Days Rule: ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పాలన అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని సీఎంగా తాను కూడా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తానని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వ 150 రోజుల పాలన గురించి ఎమ్మెల్యేంతా నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. పీ4 ద్వారా పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టనర్షిప్ ద్వారా పేదల జీవన ప్రమాణాల్ని మార్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఏపీ దేశంలో నెంబర్ 1గా ఉండాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ చేయలేకపోవటం వల్ల 4 లక్షల ఎకరాలకు నీరివ్వలేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే వాటి నిర్వహణను కూడా సక్రమంగా చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని గుంతలు పడిన రహదారులకు మరమ్మత్తులు నిర్వహణ చేయాల్సి ఉందన్న సీఎం ఆ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వెల్లడించారు.
రహదారుల కోసం సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచన - గోదావరి జిల్లాల నుంచే అమలు
భవిష్యత్‌లో 3.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు: ప్రస్తుతం ఏపీలో 1.2 లక్షల కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రాజెక్టులు జరగాల్సి ఉందని, అలాగే 70 వేల కోట్ల రైల్వే లైన్ ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రథమ ప్రాధాన్యత జాబ్ ఫస్ట్ అన్న సీఎం అందుకే మొదటి సంతకం 16 వేల 300 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై చేశానని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వీటితో పాటు పారిశ్రామికంగా, పర్యాటకంగా, చిన్నతరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా పెట్టుబడులు, ఉపాధి సాధించాలని అందుకే వీటిపై కొత్త విధానాలను తీసుకువచ్చామని అన్నారు.
రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డులోనూ 85 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. 34 వేల ఉద్యోగాలు వీటి ద్వారా వస్తాయని భావిస్తున్నామన్నారు. అలాగే 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఎన్టీపీసీ, ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు. రిలయన్స్ బయో సంస్థ కూడా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోందని, వీటి ద్వారా 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సమీప భవిష్యత్‌లో 3.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు, అదేస్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఉద్యోగాల ఆధారంగా ప్రోత్సాహకాలను ఇచ్చే పాలసీని కూడా ఏపీలో అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం శాంతిభద్రతల్ని నిర్లక్ష్యం చేసిందని, రాజకీయ ప్రాధాన్యతతో అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్‌తో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందని మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నా సీఎం, మహిళల జోలికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గంజాయి నివారణకు డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టినట్లు వెల్లడించారు.
ఏపీలో 85 వేల కోట్ల పెట్టుబడులు - 10 భారీ పరిశ్రమలకు లైన్ క్లియర్
కరడు గట్టిన నేరస్తులకు ఏపీ కేంద్రం కాదు: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా డిసెంబరు మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ చేస్తామని, ఆ ర్యాలీలో తాను కూడా పాల్గొంటానన్నారు. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ ఎకానమీలో రాణిస్తున్నారన్నారు. కరడు గట్టిన నేరస్తులకు ఏపీ కేంద్రం కాదని, వారికి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ఫింగర్ ప్రింట్ అనాలసిస్ కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలకు అగ్రపాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం సజావుగా సాగాలంటే సుపరిపాలన ఉండాలన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్టు 2024కు తీసుకువస్తున్నామన్న సీఎం, ఇందులో భూ ఆక్రమణ దారే తనకు హక్కులు ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తప్పని తేలితే 14 ఏళ్లు జైలు శిక్ష భారీ జరిమానా ఉంటుందన్నారు.