Chandrababu Review on Power Sector : జగన్ అప్పుల థియరీ ఇంధన శాఖను నిండా ముంచింది. గత వైఎస్సార్సీపీ సర్కార్ ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా సంస్థ అప్పులను రూ. 1.20 లక్షల కోట్లకు పెంచింది. ఈ పరిస్థితి నెలకొనడానికి దారితీసిన కారణాలపై సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు.
అప్పటి సర్కార్ స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా ఐదు సంవత్సరాల వ్యవధిలో బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసిన కరెంట్ ఎంత? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సంస్థపై అప్పుల భారం పెరగడానికి కారణాలేంటి తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంధన శాఖపై ఈ నెల 8న శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా సంస్థ ఆర్థిక అంశాలపై సమీక్షించారు.
ప్రజలపై రూ.18,000ల కోట్ల భారం వేసినా : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థ నిర్వహణ కోసం రూ. 53,560 కోట్లు అప్పులు చేసింది. అంతకుముందు శ్లాబ్‌ల మార్పు టారిఫ్‌ల సవరణ, ట్రూఅప్ పేరిట ప్రజలపై సుమారు రూ. 18,817 కోట్ల ఛార్జీల భారాన్ని మోపింది. ఆ తర్వాత కూడా నిర్వహణ కోసం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
సంక్షేమ పథకాల అమలులో భాగంగా వివిధ వర్గాలకు ఉచితంగా అందించిన కరెంట్‌కు సంబంధించిన రాయితీ రూ. 15,036 కోట్లు చెల్లించకపోగా, ప్రభుత్వ శాఖలు రూ. 15,795 కోట్ల మొత్తం విద్యుత్ బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాటితో పాటు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు రూ.2,000 కోట్లు అప్పుగా ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వానికి విద్యుత్ సుంకం కింద రూ.3,100 కోట్లు ముందస్తుగా చెల్లించినట్లు అధికారులు పేర్కొన్నారు.