CM Chandrababu Review On Free Bus Scheme : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో సమగ్ర విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్‌లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలన్నారు.ఆర్టీసీ, రవాణా శాఖలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఉచిత బస్సుపై సమగ్ర అధ్యయనం :మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దిల్లీ, కర్ణాటక, పంజాబ్, తమిళనాడుతో పాటు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలపై అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలన్నారు. ఈ మేరకు అధికారులబృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. కొంచెం ఆలస్యమైనా ఎలాంటి లోపాలు, మహిళలకు ఇబ్బందులు లేకుండా విధానాలను రూపొందించాలని సూచించారు.
3,500 మంది డ్రైవర్లతో 2 వేల బస్సుల్లో - మహిళలకు ఉచిత ప్రయాణం! - Free Bus Scheme in AP
ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సులు :డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్ లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలన్న చంద్రబాబు సూచించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నందున ఆర్టీసీలో వాటి వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో కేంద్రం ఇస్తున్న సబ్సిడీలను వినియోగించుకుని 1253 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోవాలని సూచించారు. దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే ఛార్జింగ్ విషయంలో తలెత్తే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలని సూచించారు. బస్సులు అద్దెకు తీసుకునే విధానం వల్ల లాభనష్టాలు, సొంతంగా బస్సులు కొనుగోలు చేయడం వల్ల కలిగే ఉపయోగాలపై పూర్తిస్థాయి నివేదికతో రావాలని సీఎం సూచించారు.