CM Chandrababu Review On Floods :ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని సీఎం నారా చంద్రబాబు నాయడు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కాజా టోల్‌గేట్, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉందని చంద్రబాబు తెలిపారు. విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణమని, అందుకే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందని చెప్పారు. గుంటూరు, విజయవాడలో సహాయక చర్యలు చేపట్టానిమని పేర్కొన్నారు. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నామని, ఆదేశాలు పాటించని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
9 మంది మృతి చెందడం బాధాకరం : అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని సీఎం అన్నారు. వర్షాలు, వరదల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారని, ఒకరు గల్లంతయ్యారని తెలిపారు. కొండచరియలు పడటం, కారులో చనిపోవడం, వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు చనిపోవడం బాధాకరమని అన్నారు. పులిచింతల నుంచి ప్రవాహం ఎక్కువగా వస్తోందని, ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని అన్నారు బుడమేరు వల్ల వీటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి ఆగిందని, ప్రకాశం బ్యారేజీ కింద పలు చోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయని తెలిపారు. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు వేస్తున్నామని వెల్లడించారు.
100 పునరావాస కేంద్రాలు- 17 స్పెషల్ టీంలు-సిద్దంగా హెలికాప్టర్లు - Ministers review on flood situation
వారికి పరిహారం అందిస్తాం :వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 107 క్యాంపులు పెట్టామని, 17 వేల మందిని తరలించామని చంద్రబాబు అన్నారు. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, వరద ముంపు ప్రాంతాలకు బోట్లు పంపించామని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడిక్కడ ఏర్పాట్లు చేశామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే తమ తక్షణ కర్తవ్యమని అన్నారు.
రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా సత్వర చర్యలు చేపడుతున్నామని అన్నారు. వరద ప్రాంతాల్లో బియ్యం, పప్పు, నూనె, పంచదార, కూరగాయలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మత్స్యకారుల కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇస్తున్నామని, సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని అన్నారు. లక్ష హెక్టార్లలో పంటలు, 7 వేల హెక్టార్లలో ఉద్యానపంటలకు నష్టం జరిగిందని అన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని సీఎం భరోసా కల్పించారు.
విజయవాడ -హైదరాబాద్ నేషనల్ హైవేపై వాహనాల నిలిపివేత - Officials Stop RTC Buses
వైఎస్సార్సీపీ దుష్ప్రచారం :అత్యవసర పరిస్థితి కోసం 8 బోట్లు, 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచామని చంద్రబాబు తెలిపారు. బుడమేరు వాగును కొల్లేరులో కలిపే పనులను గతప్రభుత్వం చేయలేదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వీటీపీఎస్ మునిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లుగా పడని వర్షాలు ఇప్పుడు పడ్డాయని, అమరావతి మునిగిందని వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని తెలిపారు. కొండవీటి వాగు వల్ల అమరావతికి ఎలాంటి ఇబ్బందీ లేదని వెల్లడించారు. అమరావతి ముంపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిండుకుండలా ప్రాజెక్టులు- దిగువ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు - HEAVY FLOOD TO PROJECTS IN AP