CM Chandrababu Participated in Vana Mahotsava Program :ప్రతీ ఒక్కరూ ఆక్సిజన్ తీసుకోవటం ఎంత అవసరమో, ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటటమూ అంతే ముఖ్యంగా భావించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ మహాయజ్ఞంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో ఉమముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పచ్చని కొండతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని చంద్రబాబుతో పవన్ కల్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు వేప, రావి మొక్కలను నాటారు. అలాగే పవన్ కల్యాణ్, పెమ్మసాని చంద్రశేఖర్ చెరో మొక్క నాటారు. ఆకుపచ్చని ఆశయాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్, పెమ్మసాని, అధికారులు ప్రతిజ్ఞ చేశారు.
అడవుల సంరక్షణకు డ్రోన్ల వినియోగం : రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లర్లు ఇన్నాళ్లూ ఆడిన ఆటలు ఇక సాగవని, అడవిలో స్మగ్లర్లు అడుగుపెడితే ఇక అదే వారికి చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అడవుల సంరక్షణకు డ్రోన్లను వినియోగిస్తామన్న చంద్రబాబు, స్మగ్లర్ల కంటే ముందే డ్రోన్లే అడవుల్లో ఉంటాయని తెలిపారు. శ్రీశైలం-నాగార్జున సాగర్ మధ్య దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం అభివృద్ధి చెందబోతోందని స్పష్టం చేశారు. 32 ఎకో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తమ ఆలోచన హరితాంధ్రప్రదేశ్, ఆశయం స్వర్ణాంధ్ర ప్రదేశ్ అని స్పష్టం చేశారు.
ఎక్కువ మొక్కలు నాటే విద్యార్థులకు అవార్డులు : విద్యార్థులు మొక్క పెంచితే ఆ మొక్కకు ఆ విద్యార్థి తల్లి పేరు పెడతామని సీఎం అన్నారు. జగన్ పట్టాదారు పాస్ పుస్తకాలపై తన ఫొటో వేసుకున్న పనులు తాము చేయబోమన్నారు. ఎక్కువ మొక్కలు నాటే పర్యావరణ ప్రేమికులకు మండల, జిల్లా స్థాయిలో అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామని ప్రకటించారు. మొక్కలు ఎక్కువ నాటే విద్యార్థులకు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకలాంటి సందర్భాల్లో అవార్డులిస్తామన్నారు.
అప్పుడు ఎగతాళి చేశారు : ఎకో పార్కు ప్రాంతం పర్యాటకంగానూ అభివృద్ధి చెందాలని చంద్రబాబు అన్నారు. వనమహోత్సవం ఎంతో మహొత్తరమైన కార్యక్రమమని తెలిపారు. పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులంతా గ్రహించాలని, రాష్ట్రంలో పచ్చదనం 50 శాతానికి పెరగాలన్నారు. ఒకప్పుడు ఇంకుడు గుంతలు తవ్వితే చాలా మంది ఎగతాళి చేశారని గుర్తు చేశారు. కానీ, భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు చాలా అవసరమని అన్నారు. పవన్ కల్యాణ్ వద్ద అటవీ, నరేగా శాఖలు ఉన్నాయి. రెండు శాఖల సాయంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
బ్రహ్మంగారు నివసించిన రవ్వలకొండను కూడా తవ్వేశారు :అటవీ ప్రాంతం క్రమంగా తగ్గిపోతోందని, పర్యావరణంలో పెను మార్పులు వస్తున్నాయని సీఎం అన్నారు. భూతాపం, కాలుష్యం బాగా పెరుగుతున్నాయని, పర్యావరణ పరిరక్షణపై అందరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో నదులు, చెరువులు, కొండలను ధ్వంసం చేశారని, బ్రహ్మంగారు నివసించిన రవ్వలకొండను కూడా తవ్వేశారని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అన్నారు.