CM Chandrababu in Annamayya District: రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను నెలనెలా స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేస్తున్న సీఎం చంద్రబాబు, నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. సంబేపల్లి మండలం మోటుకట్లలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. అదే విధంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఐటీ ఉద్యోగులకు జిల్లాలవారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసేందుకు అన్నమయ్య జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. సంబేపల్లి మండలం మోటుకట్లలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలుత చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం కొప్పుల మంగమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు.
వారి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తనకు ఇల్లు లేదని, తన మనవరాలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేయడంతో వారికి ఇంటిపట్టా, మూడు ఉచిత సిలిండర్ల ధ్రువపత్రాలను సీఎం అందజేశారు. త్వరలోనే పక్కా ఇళ్లు నిర్మాణంతో సహా సూర్యఘర్ పథకం కింద ఉచితంగా సోలార్ విద్యుత్ యూనిట్ అందిస్తామని హామీ ఇచ్చారు.
'వికసిత్ భారత్ దార్శనికతకు ప్రతిబింబం' - నిర్మలమ్మ బడ్జెట్‌పై చంద్రబాబు స్పందన
అదే గ్రామంలోని దివ్యాంగుడు గొల్ల వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు అతడికి పింఛన్‌తోపాటు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రై సైకిల్‌ను అందజేశారు. గ్రామంలోని పలువురు ఆటోడ్రైవర్లకు ఎలక్ట్రికల్ ఆటోలను పంపిణీ చేశారు. వారి సాదకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఆటో ఛార్జింగ్ అదనపు భారం కాకుండా ఇంటి వద్దే సోలార్ విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసి మరింత ఆర్థిక వెసులుబాటు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం సంబేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో కోటి 64 లక్షల అంచనాతో సీసీ రోడ్లు, కాలువ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
ఉద్యోగమే అభ్యర్థిని వెతుక్కుంటూ: గ్రామంలో ప్రజావేదిక వద్ద సాప్ట్‌వేర్ ఉద్యోగులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. నాడు చంద్రబాబు ఐటీని ప్రోత్సహించడం వల్ల సాప్ట్‌వేర్ ఉద్యోగాలు సాధించామని పలువురు వివరించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇంటి వద్ద నుంచే పనిచేసే పరిస్థితి వస్తుందని సీఎం చెప్పారు. అభ్యర్థులు ఉద్యోగం వెతుక్కునే పరిస్థితి ఉండదని, ఉద్యోగమే అభ్యర్థిని వెతుక్కుంటూ ఇంటికి వస్తుందని చెప్పారు.
రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి కరవు అనే మాట వినబడకుండా చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఏఐ సాంకేతికత వినియోగంలో నైపుణ్యం సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన సాగిస్తే, నేడు ప్రజల చేతుల్లోకి పాలన వచ్చిందని వాట్సప్ గవర్నెన్స్‌ను ఉద్దేశించి అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు సంబేపల్లి మండల కేంద్రం సంత గేటు ప్రవేశ ద్వారం వద్ద ప్రజల కేరింతల నడుమ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి, అభ్యున్నతికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ఈ ఏడాదే తల్లికి వందనం - అన్నదాత-సుఖీభవకు 3 విడతల్లో రూ.20 వేలు