ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చరిత్ర తిరగరాయబోయే ప్రాజెక్టు - పూర్తైతే తెలుగుతల్లికి జలహారతి ఇచ్చినట్లే : సీఎం చంద్రబాబు - CM CHANDRABABU ON RIVERS INTERLINK

మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తికి ప్రణాళికలు - పూర్తి చేస్తే రాష్ట్రానికి ఎంతో ఆదాయమన్న సీఎం చంద్రబాబు

CM_Chandrababu
CM Chandrababu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 5:17 PM IST

CM Chandrababu on Interlinking of Rivers: బనకచర్లకు నీటిని తీసుకెళ్లగలిగితే నదుల అనుసంధానం పూర్తై రిజర్వాయర్ల అనుసంధానం కూడా పూర్తవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన దాదాపు రాష్ట్రమంతా అనుసంధానమై అదనపు ఆయకట్టు వస్తుందని తెలిపారు. గోదావరి -బనకచర్ల అనుసంధానం పూర్తైతే తెలుగుతల్లికి జలహారతి ఇచ్చినట్లేనని అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే రాష్ట్రానికి ఎంతో ఆదాయం: మూడు దశల్లో ప్రాజెక్టు పూర్తికి ప్రణాళికలు చేపట్టామని తెలిపారు. పోలవరం నుంచి కృష్ణానదికి గోదావరి వరద నీరు మళ్లించటం మొదటి దశ అన్న సీఎం, రెండోదశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి అక్కడికి నీళ్లు తరలిస్తామని వెల్లడించారు. మూడోదశలో బొల్లాపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్​కు నీటిని మళ్లిస్తామన్నారు. బనకచర్ల రాయలసీమకు గేట్ వే కానుందని తెలిపారు. ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. దాదాపు 80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే రాష్ట్రానికి ఎంతో ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంజర్: గోదావరి - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ కానుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమగ్ర నదుల అనుసంధానంతోనే రాష్ట్రంలో కరవు, ఇతర విపత్తులు ఎదుర్కోగలమని తెలిపారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేసి నీటిని ఒడిసిపట్టుకోవటంతో 729 టీఎంసీల నీరు నిల్వచేసుకోగలిగామన్నారు. సమగ్ర నదుల అనుసంధానం చేస్తే భవిష్యత్తులో నీటి సమస్యలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. ఖరీఫ్ తర్వాత ఇంతపెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేయటం చరిత్రలో ఇదే ప్రథమమని అన్నారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్​లో నీటి పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ సీఎం అయ్యే వరకూ నీటి పరిరక్షణ చర్యలు మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా ఎన్టీఆర్ రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చిన నాయకుడని ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ 90శాతం ప్రాజెక్టులు తెలుగుదేశం ప్రభుత్వమే చేపట్టి పూర్తి చేసిందన్నారు. ఉత్తరాంధ్రలో నీటివనరుల మౌలిక సదుపాయాలు తక్కువ ఉండటం వల్ల వర్షపాతం ఉన్నా నీటి సమస్యలు ఎక్కువని అన్నారు. రాయలసీమకు నీళ్లవ్వగలిగితే రత్నాల సీమ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. రాయలసీమకు నీళ్లిస్తే, డెల్టాకంటే ఆ ప్రాంతానికి ఎక్కువ ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

3 ఏళ్లలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును పూర్తి: డబ్బుంటే 3 ఏళ్లలో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోదీకి ఈ ప్రాజెక్టు నివేదిక పంపిస్తున్నామన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​తో దీనిపై ఇప్పటికే మాట్లాడామని తెలిపారు. కేంద్రమే మొత్తం భరించలేదు కాబట్టి హైబ్రిడ్ మోడల్​లో నిధుల సమీకరణ ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి -బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పూర్తైతే దేశంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

చరిత్ర తిరగరాయబోయే ఈ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టు వల్ల 80 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుందని వ్యాఖ్యానించారు. దాదాపు 48 వేల ఎకరాల భూ సేకరణ అవసరమని వివరించారు. అటవీ భూమి 17 వేల ఎకరాల అవసరం అవుతుందన్నారు. చరిత్ర తిరగరాయబోయే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. రాబోయే తరాలకు నీటి సమస్య లేకుండా చేసే ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో కూడా చర్చ జరగాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

హైబ్రీడ్ విధానంలో పూర్తిచేసే ఆలోచన: గోదావరి -బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును హైబ్రీడ్ విధానంలో పూర్తిచేసే ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రైవేటు సంస్థలు ప్రాజెక్టు చేపడితే తర్వాత ప్రభుత్వం వాటికి చెల్లింపులు చేసే హైబ్రీడ్ విధానం రాజస్థాన్​లో చేశారని గుర్తు చేశారు. రహదారులు నిర్మాణం ఎలా జరుగుతోందో, ప్రాజెక్టులు నిర్మాణం కూడా ప్రైవేటు సంస్థలు చేపట్టి నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు.

వయబిలిటీ గ్యాప్ ఫండ్ వరకూ ప్రభుత్వం ఇస్తుందని తర్వాత సకాలంలో నీరిస్తేనే చెల్లింపులు చేసే హైబ్రీడ్ విధానంపై ఆలోచనలు చేస్తున్నామన్నారు. డీపీఆర్ పూర్తి చేసి 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వైపు పయణిస్తోందని తెలిపారు. మనమూ ఆ దిశగా ఆలోచనలు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. సగటు యూనిట్ విద్యుత్ ధరను 5.18 నుంచి 4.80 రూపాయలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్నామన్న సీఎం, వచ్చే 5 ఏళ్లలో విద్యుత్ రంగంలో వినూత్న మార్పు చూస్తారని తెలిపారు.

ఏపీలో మరో భారీ ప్రాజెక్టు - వేల కోట్లతో ప్రణాళికలు

'పోలవరం పూర్తయ్యేది అప్పుడే - టార్గెట్ ప్రకటించిన సీఎం చంద్రబాబు

విశాఖ ప్రజలకు గుడ్​న్యూస్ - మెట్రో ప్రాజెక్టు మొదటి దశ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం

ABOUT THE AUTHOR

...view details