CM Chandrababu Instructions to Officials on Rains:వాయుగుండం ప్రభావంలో రాష్ట్రంలో వర్థాలు కురుస్తున్నాయి. వర్ష సహాయ చర్యల కోసం జిల్లాకు 3 కోట్ల రూపాయల చొప్పున తక్షణం విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భారీ వర్షాలతో చనిపోయిన 8 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. భారీ వర్షాలు ఆదివారం కూడా ఉంటాయన్న సమాచారంతో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు సీఎస్, డీజీపీ, మంత్రులు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శ్రీకాకుళం-విశాఖ మధ్య ఇవాళ రాత్రికి తుపాను తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు మరింత అప్రమత్తతో ఉండాలన్నారు. వర్షాలు తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు 3 కోట్ల రూపాయలు, కాస్త తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలకు 2 కోట్ల రూపాయలు చొప్పున నిధుల విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
అప్రమత్తతతో ప్రజల ఇబ్బందులు తగ్గించవచ్చు: భారీవర్షాల దృష్ట్యా ప్రజలు రేపు కూడా జాగ్రత్తలు పాటించాలని సీఎం అన్నారు. పట్టణాల్లో నీరు నిలిచిన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని నీటి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను పొక్లెయిన్లతో తొలగించాలని సీఎం ఆదేశించారు. ఓపెన్ డ్రెయిన్లు ఉండేచోట హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. వరద ప్రాంతాల్లో వాగులపై వాహనాలను అనుమతించవద్దని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న వంతెనలపై రాకపోకలు నిలిపేయాలని అన్నారు.
విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలని ఆదేశించారు. తుపాను భవనాలు సిద్ధం చేసి పునరావాసానికి ఏర్పాట్లు చేయాలని అన్నారు. భారీవర్షాలున్న జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించాలని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటన జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. హుద్‌హుద్ సమయంలో తీసుకున్న విధానాలు అనుసరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.