ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2027లోపు పోలవరం పూర్తి - జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ పనులు: సీఎం చంద్రబాబు - CM CHANDRABABU ON POLAVARAM PROJECT

ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పిన చంద్రబాబు - 2026 మార్చిలోపు కొత్త డయాఫ్రమ్ వాల్‌ పూర్తవుతుందని వెల్లడి

CHANDRABABU_ON_POLAVARAM
CM Chandrababu on Polavaram Project (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2024, 6:25 PM IST

CM Chandrababu on Polavaram Project: ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 2027లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. నిధుల విడుదల విషయంలో కేంద్రం కూడా సుముఖంగా ఉందని, నిపుణులు, సాంకేతిక సిబ్బంది సూచనలు, సలహాలతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. 2026 మార్చిలోపు కొత్త డయాఫ్రమ్ వాల్‌ పూర్తవుతుందని తెలిపారు.

జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం ప్రారంభమవుతుందని అన్నారు. శాసనసభలో జలవనరులపై జరిగిన చర్చలో పాల్గొన్న చంద్రబాబు, 2014 నుంచి 2019 మధ్య పోలవరం ప్రాజెక్టు కోసం చేసిన కృషిని వివరించారు. అదే సమయంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ సర్కార్‌ చేసిన విధ్వంసాన్ని ఆధారాలతో సహా వివరించారు.

విదేశీ నిపుణుల సహకారంతో పోలవరం డిజైన్లు

28 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించా:రాష్ట్రానికి పోలవరం జీవనాడి, వెన్నెముక అని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తయితే కరవుకు చెక్ పెట్టవచ్చని, ఏపీకి అమరావతి, పోలవరాన్ని రెండు కళ్లుగా భావించానని స్పష్టం చేశారు. పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి సంకల్పించామన్న సీఎం, ప్రాజెక్టును జాతీయప్రాజెక్టుగా ప్రకటించారని అన్నారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని పట్టిసీమ ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వాలనుకున్నామని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తిచేసి, రాయలసీమకు నీళ్లిచ్చామని గుర్తు చేశారు.

టీడీపీ కొనసాగి ఉంటే పోలవరం పూర్తయ్యేది:పోలవరం ప్రాజెక్టు జాప్యం కాకూడదనే నిర్మాణ బాధ్యతలు చేపట్టామని, గత ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రికి డయాఫ్రమ్‌ వాల్‌ అంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు. 2014-19 మధ్యలో 72 శాతం పోలవరం పనులు పూర్తి చేశామని, 28 సార్లు పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించానని గుర్తు చేశారు. 80 సార్లకుపైగా పోలవరంపై వర్చువల్‌గా సమీక్ష చేశానని, టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేదని అభిప్రాయపడ్డారు.

పోలవరం నిర్మాణాలపై కొనసాగుతున్న విదేశీ నిపుణుల మేధో మథనం

దుర్మార్గ ఆలోచనలు రాష్ట్రానికి శాపంగా మారాయి: మాపై కక్షతో గతం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఆపేస్తున్నట్లు ప్రకటించిందని అన్నారు. మూర్ఖత్వం, చేతకానితనం వల్ల గత ప్రభుత్వం ప్రాజెక్టు పనులు ఆపేసిందని, 2014-19 మధ్య తాము పడిన కష్టం, వైఎస్సార్సీపీ వల్ల నాశనమైందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఒకే రోజులో 32 వేల క్యూబిక్‌ మీటర్లకు పైగా కాంక్రీట్ పనులు చేశామని అన్నారు. గతంలో 414 రోజుల్లోనే పోలవరం డయాఫ్రమ్ వాల్‌ పూర్తిచేశామని గుర్తు చేశారు.

పర్సెంటా, అర పర్సెంటా అని అవహేళన చేశారు:తొందరపాటు తగదని కేంద్రసంస్థ చెప్పినా గత ప్రభుత్వం వినలేదని అన్నారు. పోలవరాన్ని సరిగా పర్యవేక్షించకపోవడంతో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని, ఒక వ్యక్తి దుర్మార్గ ఆలోచనలు రాష్ట్రానికి శాపంగా మారాయని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రాష్ట్రానికి రూ.వేలకోట్లు నష్టం వాటిల్లిందని, కేవలం 3.08 శాతమే పోలవరం పనులు చేసిందని తెలిపారు. పోలవరం గురించి అడిగితే పర్సెంటా అర పర్సెంటా అని అవహేళన చేశారన్నారు. గత ఇరిగేషన్ మంత్రికి టీఎంసీకి, క్యూసెక్కులకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.

పోలవరం జలవిద్యుత్ కేంద్రంలో కీలకమైన పనులు ప్రారంభం

పోలవరం కట్టాలనే ఆలోచన ఇప్పటిది కాదు: నీటిసంరక్షణకు అందరూ చర్యలు తీసుకుందామన్న సీఎం, సాగునీటి సంరక్షణపై సభ్యులంతా అవగాహన పెంచుకోవాలని సూచించారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా కల్చర్ వల్ల నీరు కలుషితం అవుతున్నాయని, తాగు, సాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పోలవరం కట్టాలనే ఆలోచన ఇప్పటిది కాదని, 1981లో ప్రాజెక్టుకు అంజయ్య పునాది వేశారని గుర్తు చేశారు. రాయలసీమలో ఎక్కడ చూసిన టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులే దర్శనమిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం: పోలవరం ప్రాజెక్టు ఎత్తు కచ్చితంగా 45.72 మీటర్లు ఉంటుందని స్పష్టం చేశారు. 2014-19 మధ్యలో పోలవరంపై రూ.16,493 కోట్లు చేశామన్న సీఎం చంద్రబాబు, గత ప్రభుత్వం పోలవరంపై కేవలం రూ.4,099 కోట్లే ఖర్చు చేసిందని తెలిపారు. పోలవరానికి రెండేళ్లలో రూ.12,157 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదించిందని, జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం ప్రారంభిస్తామని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల-స్రవంతి కోసం స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిత్యం శ్రమించారని కొనియాడారు. సుజల-స్రవంతి ప్రాజెక్టులో గత ప్రభుత్వం తట్ట మట్టి కూడా తీయలేదని సీఎం విమర్శించారు. త్వరలో సుజల-స్రవంతి ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ - నిపుణుల బృందం నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details