CM Chandrababu Speech in Zurich : రాజకీయాల్లోకి వచ్చేలా యువతను ఎక్కువగా ప్రోత్సహించానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. యూరప్‌లోని 12 దేశాల నుంచి ఈ సమావేశానికి వచ్చారని పేర్కొన్నారు. అవకాశం ఉన్న ప్రతిచోటుకూ మనవాళ్లు వెళ్లిపోతారని వివరించారు. తెలుగువాళ్లు ఎక్కడైనా గొప్పగా పని చేస్తారని అదేవిధంగా రాణిస్తారని అన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు మీరంతా బాగా మద్దతిచ్చారని గుర్తుచేశారు. జ్యూరిచ్‌లో ఏర్పాటు చేసిన తెలుగు పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రుల భేటీలో ఆయన పాల్గొని మాట్లాడారు.
"మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టించాలని దేవుడిని కోరుకుంటున్నా. యువతలో సరికొత్త ఆలోచనలు రావాలి, చైతన్యవంతులు కావాలి. ఆ రోజుల్లో ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా. అనేకమంది యువత గ్రామాల నుంచి నగరాలకు వచ్చి ఐటీ చదువుకున్నారు. హైదరాబాద్‌లో భూములు అమ్ముకోవద్దని అనేకమందికి చెప్పా. హైదరాబాద్‌లో భూములకు మంచి ధర వస్తుందని ఆనాడే చెప్పా." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
'తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయానికి హైదరాబాద్ సంపదే కారణం. చదువులో ఆడపిల్లలపై వివక్ష చూపించవద్దని ఆనాడే చెప్పా. ఇప్పుడు యువతులు కూడా అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి వెళ్లినా అమ్మాయిలు కనిపిస్తున్నారు. ప్రస్తుతం యువకుల కంటే యువతులకే ఎక్కువ ఆదాయం వస్తోంది. పురుషుల కంటే మహిళలే తెలివైన వాళ్లని నిరూపితమైంది. డబుల్ ఇన్‌కమ్ నో కిడ్స్ లెట్స్ ఎంజాయ్ విధానం వచ్చింది. జనాభా తగ్గిపోయి అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి' అని సీఎం వివరించారు.
హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని మంత్రి లోకేశ్ గుర్తుచేశారు. చంద్రబాబు చేతిలో ఫైళ్లు పట్టుకుని న్యూయార్క్ వీధుల్లో తిరిగారని అన్నారు. ఆలోచనలు, ఉత్సాహంలో ఆయనతో పోటీపడలేకపోతున్నామని చెప్పారు. జైలులో పెట్టినప్పుడూ చంద్రబాబు అధైర్యపడలేదని ఆయణ్ని కలిసేందుకు వెళ్లిన తమకే ధైర్యం చెప్పేవారని వివరించారు. ఎక్కడికి వెళ్లినా తెలుగువాళ్లు గొప్పగా ఉండాలని ఆయన అంటారని లోకేశ్ వెల్లడించారు.