ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాన్వాయ్‌లు, సైరన్‌ల వంటి ఆడంబరాలు వద్దు - మంత్రులకు చంద్రబాబు సూచనలు - CBN Instructions to Ministers

CM Chandrababu Instructions to Ministers: అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ తారకమంత్రమని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. ప్రతి మంత్రిత్వశాఖకు సంబంధించి వచ్చే వంద రోజుల్లో చేయాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఆర్థిక అంశాలతో ముడిపడని హామీలు తక్షణం అమలు చేయాలని దిశానిర్దేశం చేసారు. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కూటమి ప్రభుత్వంపై ఎన్నోఅంచనాలు ఉన్నందున వాటికీ తగ్గట్లు ప్రతిఒక్కరు కష్టపడాలని ఆదేశించారు. కాన్వాయ్‌లు, సైరన్‌ల వంటి ఆడంబరాలకు స్వస్తిపలికి ప్రజలతో మమేకం కావాలన్నారు.

CM Chandrababu Instructions to Ministers
CM Chandrababu Instructions to Ministers (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 9:12 AM IST

కాన్వాయ్‌లు, సైరన్‌ల వంటి ఆడంబరాలు వద్దు - మంత్రులకు చంద్రబాబు సూచనలు (ETV Bharat)

CM Chandrababu Instructions to Ministers :మంత్రివర్గంలో 17 మంది తొలిసారి మంత్రులు కావడం, వారిలోనూ ఏడుగురు మొదటిసారి ఎమ్మెల్యేలు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి కేబినెట్‌ భేటీలో వారికి నిర్దిష్టంగా కొన్ని సూచనలు చేశారు. తమ శాఖలపై మంత్రులు లోతుగా అధ్యయనం చేయాలని, వీలైనంత త్వరగా అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు తమకన్నీ తెలుసన్న భావన వీడాలని హితబోధ చేశారు. అనాలోచిత, తొందరపాటు నిర్ణయాలు వద్దని, సమష్టిగా నిర్మాణాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల పేషీల్లో వివాద రహితుల్ని, మంచి నడవడిక ఉన్నవారినే అధికారులు, సిబ్బందిగా నియమించుకోవాలన్నారు. కొందరు పార్టీలు, కులాల పేరుతో అంతరాలు పెంచేందుకు ప్రయత్నిస్తారని వాటిని సమర్థంగా తిప్పికొట్టాలన్నారు.

సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిస్తూ, అభివృద్ధికీ పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భారీ ఖర్చుతో పెద్ద పెద్ద సభలు నిర్వహించే విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. మనం చెప్పాలనుకున్నది ప్రజలకు చేరితే చాలన్నారు. చిన్న సమావేశాలైతే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుబంధం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. తాము ప్రజా జీవితంలో ఉన్నామని నిరంతరం గుర్తుంచుకోవాలని ఎవరూ అభ్యంతరకర భాష వాడొద్దని హెచ్చరించారు. ఏ పని చేసినా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. శాఖాపరమైన సమీక్షా సమావేశాల సమయం తగ్గించుకోవాలని, వీలైనంత వరకు సాయంత్రం ఆరు గంటల తర్వాత సమావేశాలు వద్దని చంద్రబాబు సూచించారు.

ఏపీ కేబినెట్​ కీలక నిర్ణయాలు - సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు ఆమోద ముద్ర - Andhra Pradesh Cabinet Meeting

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని వెంటనే చేయగలిగినవి, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడినవి అని రెండు విభాగాలుగా చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు. ఆర్థికపరమైన అంశాలతో సంబంధం లేనివి వెంటనే నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థికపరమైన అంశాలతో ఉన్న వాటికి గడువు పెట్టుకుని అమలు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగులపై అభ్యంతరకర పదజాలంతో విరుచుకుపడటం వంటివి చేయవద్దని మంత్రులకు హితబోధ చేశారు. ఎంపీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ కేంద్రం మద్దతుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేయాలన్నారు.

పోలవరంపై చర్చ సందర్భంగా ఆ ప్రాజెక్టుని ఎప్పటిలోగా పూర్తి చేయగలమని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించగా దానిపై అంతర్జాతీయ నిపుణులు అధ్యయనం చేస్తున్నారని, వారి నివేదిక వచ్చాకే ఒక అంచనాకు రాగలమని చంద్రబాబు చెప్పారు. అన్న క్యాంటీన్ల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది భవన నిర్మాణ కార్మికులు కాబట్టి క్యాంటీన్‌లు పునఃప్రారంభించే కార్యక్రమంలో వారిని భాగస్వాముల్ని చేయాలన్న సూచన మంత్రివర్గ సమావేశంలో వచ్చింది. క్యాంటీన్ల నిర్వహణకు ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ప్రతిపాదించారు.

ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఎలా? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​తో భేటీ అయిన సినీ నిర్మాతలు - Producers Meeting with Pawan Kalyan

టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే 2 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు : గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ గడువు జులై నెలాఖరుతో ముగుస్తున్నందున వచ్చేనెల రెండు లేదా మూడో వారంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. 1994 నుంచి ఇప్పటి వరకు టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే డీఎస్సీలో 2 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ అయ్యాయని సమావేశంలో చర్చకు వచ్చింది. పింఛను మొత్తం పెంచాలన్నా, ఉద్యోగాలివ్వాలన్నా చంద్రబాబే గుర్తొస్తారని కొందరు మంత్రులు కొనియాడారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం - కీలక అంశాలపై చర్చ! - AP Govt First Cabinet Meeting

ABOUT THE AUTHOR

...view details