CM Chandrababu Fire on Ministers :అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్నిప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదైనా సంఘటన జరిగితే ఎందుకు వేగంగా స్పందించడం లేదని నిలదీసినట్లు సమాచారం. విజయనగరం జిల్లా గుర్ల అతిసార ఘటనను ఇందుకు ఉదాహరణగా చూపించిన ఆయన జిల్లా మంత్రి, ఇంఛార్జ్ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఎందుకు స్పందించలేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లా ఇంఛార్జ్ మంత్రులను నియమించి 15 రోజులైనా ఇంకా క్షేత్రస్థాయి పర్యటనలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారని తెలిసింది. పింఛన్లకు అర్హత నిర్ణయించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరించిన ఆరంచెల పరిశీలన ఇకపై ఉండదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
కేబినెట్ భేటీ అనంతరం బుధవారం చంద్రబాబు రాజకీయ అంశాలపై మంత్రులతో విడిగా సమావేశమై వారి పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రతి క్షణం విలువైనదేనని జిల్లాలకు ఇంఛార్జ్లుగా నియమించినా క్రియాశీలకంగా ఉండకపోవడం ఏంటని నిలదీసినట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలును, ఉచిత సిలిండర్ల విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులదే అని చంద్రబాబు స్పష్టంచేశారు.
AP Cabinet Meeting :శాఖపరమైన విషయాలే మాట్లాడతామంటూ గిరిగీసుకోవద్దని చంద్రబాబు తెలిపారు. కొందరైతే వారి శాఖలు గురించీ మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. విపక్షాలు బురద జల్లితే వెంటనే స్పందించి, వాస్తవాలేంటో ప్రజలకు చెప్పి, విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. కూటమి పక్షాలతో మంచి సమన్వయం ఉండాలని , కేంద్రం చేస్తున్న మంచిని ప్రజలకు పదే పదే చెప్పాలని మంత్రులకు సీఎం సూచించారు.
రాష్ట్రానికి కేంద్రం వివిధ రూపాల్లో ఇస్తున్న నిధులు గురించి వివరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఉచిత ఇసుక విధానం సమర్థంగా అమలయ్యేలా అమాత్యులు, ఇంఛార్జ్ మంత్రులే చూడాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఇసుక తీసుకెళ్లే ఎడ్లబళ్లు, ట్రాక్టర్లను అడ్డుకుంటే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పట్టా భూముల్లో రైతులు ఇసుక తవ్వుకుని వారిష్ట ప్రకారం అమ్ముకోవచ్చని చెప్పారు. ఇసుకపై నియంత్రణలన్నీ తొలగించి, సీనరేజి రద్దు చేశాక ప్రజా స్పందన మంత్రులు తెలుసుకున్నారా అని సీఎం అడగ్గా ఇసుక లభ్యత పెరిగి, వినియోగదారులకు చేరేందుకయ్యే ఖర్చు గణనీయంగా తగ్గిందని మంత్రులు రాంనారాయణరెడ్డి, అచ్చెన్న , పార్ధసారథి బదులిచ్చినట్లు సమాచారం.
ఆ 15 మంది MLAలకు చంద్రబాబు వార్నింగ్! - ఉచిత ఇసుక సరఫరా, మద్యం టెండర్లలో జోక్యం