CM Discussion with Officials about free Bus Scheme: ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక చర్చలు జరిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సీఎం అడిగి తెలుసుకున్నారు.
ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక, దిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫీల్డ్ విజిట్స్ చేసి సమగ్ర నివేదిక రూపొందిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనలు త్వరితగతిన పూర్తి చేసి సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా తనకు అందచేయాలని సీఎం చంద్రబాబు కోరారు. ఉగాది నాటికి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం చంద్రాబాబు ఆదేశించారు.
మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు:ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి నేతృత్వంలో ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘం ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు తీరును చూడటంతో పాటు, అధికారులిచ్చిన నివేదికపైనా పరిశీలన చేయనుంది. ప్రస్తుతం ఆర్టీసీలో నిత్యం సగటున 44 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో పాస్‌హోల్డర్లు కాకుండా రోజుకు 27 లక్షల మంది టికెట్లను కొనుగోలు చేస్తారు. వీరిలో సూపర్‌లగ్జరీ, అల్ట్రాడీలక్స్, ఏసీ సర్వీసుల్లో ప్రయాణించేవారు దాదాపు 3 లక్షల మంది వరకు ఉన్నారు.