CM Chandrababu on Political Issues: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారంపై క్యాబినెట్ సమావేశానికి ముందు చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చ లేవనెత్తారు. అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులే ఇప్పుడూ కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపైనా కీలక చర్చ జరిగింది.
మంత్రివర్గ సమావేశం ముగిశాక రాజకీయ అంశాలపై సీఎం చర్చించారు. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పలు జిల్లాల ఎస్పీలు మంత్రుల ఫోన్లకు సరిగా స్పందించట్లేదని వారు వ్యాఖ్యానించారు. కింద స్థాయిలో డీఎస్పీ, సీఐలపై నెపం నెట్టి తప్పుకుంటున్నారని ఆరోపించారు. ఇంట్లో మహిళల్ని కించపరిచేలా పెడుతున్న పోస్టులకు తట్టుకోలేకే తానూ తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నట్లు సమాచారం.
గత ప్రభుత్వం నుంచే కొందరు పోలీసులు ఇలా తయారయ్యారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నెల రోజుల్లో వ్యవస్థను గాడికి తెద్దామని చంద్రబాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య పోస్టులను ఇకపై ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వివిధ శాఖల్లో పలువురు అవినీతిపరులు అధికారులుగా చలామణి అవుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించినట్లు తెలిసింది.
డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం - 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం
Pawan Kalyan on Fake Posts :సోషల్ మీడియా పోస్టులకు తన ఇంటి ఆడబిడ్డలు కంటతడి పెట్టుకోవటం చూసి తట్టుకోలేకపోయానని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఫేక్ పోస్టులతో ఆడ బిడ్డలు బయట తిరగలేని పరిస్థితులు ఉంటే సీరియస్ యాక్షన్ ఉండాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. కొన్ని సంఘటనల్లో మహిళ లేదా బాలికపై అత్యాచారం జరిగిందని, జరగలేదనీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ చర్చ జరగటం సబబు కాదని అన్నారు. అత్యాచారం జరిగిందా లేదా అనే అంశంపై చర్చకు తావు ఇవ్వకుండా బాధితురాలు గౌరవప్రదంగా తిరిగే వాతావరణం కల్పించాలని మంత్రివర్గం అభిప్రాయపడింది.