Chandrababu Chit Chat With Ministers : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి ఉపయోగిస్తున్నారని చెబితే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ గతంలో తప్పుబట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అప్పట్లో మనం చెప్పింది నిజమేనని ఇప్పుడు సీబీఐ అరెస్టుల ద్వారా తేటతెల్లమైందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన కొద్దిసేపు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి సంబంధించి పలువురిని సీబీఐ అరెస్టు చేయడం సహా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాకు వైఎస్సార్సీపీ హయాంలో టెండర్లు పిలిచారని కొందరికి అనుకూలంగా నిబంధనలు కూడా సడలించారని తెలిపారు. ఇవన్నీ బయటపడ్డాక కూడా జగన్ నెయ్యి సరఫరాలో అక్రమాలు లేవంటూ మాట్లాడారని అన్నారు. దీంతో పాటు దారి మళ్లింపు రాజకీయం చేస్తున్నారంటూ ఆయన దుష్ప్రచారానికి యత్నించారని మంత్రులు గుర్తుచేశారు.
తాను చెప్పిందే నిజమని నమ్మించేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో జరిగిన బాబాయ్ హత్య కేసును టీడీపీపై నెట్టేందుకు ప్రయత్నించడమే దీనికి నిదర్శనమని కొందరు వివరించారు. గతంలో కోడికత్తి డ్రామాను కూడా తెలుగుదేశం పార్టీపై వేయాలని చూసినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో సానుభూతి సంపాదించేందుకు గులకరాయి డ్రామా ఆడినా తిప్పికొట్టామని గుర్తుచేసుకున్నారు. జగన్ నాటకాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎంతో సహా మంత్రులూ అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ నేతల అడ్డగోలు ఆక్రమణలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.