CM Chandrababu met Union Minister CR Patil :పోలవరం ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన డయాఫ్రంవాల్ నిర్మాణ పనులను పాత గుత్తేదారు సంస్థకే అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చాయి. దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించిన సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపైనే చర్చించారు. భారీ వరదలకు దెబ్బతిన్న డయాఫ్రంవాల్ స్థానంలో కొత్తది నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించగా ప్రస్తుతం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థ మేఘా 2022 నాటి ధరల ప్రకారమే 73వేల క్యూబిక్ మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మాణానికి సిద్ధమని చెప్పింది.
దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడదని మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి కొత్తవారిని ఎంపిక చేసేందుకు పట్టే సమయం కూడా ఆదా అవుతుందని కేంద్రమంత్రి పాటిల్ చంద్రబాబుకు వివరించారు. అయితే పాత గుత్తేదారుకు ఇచ్చేందుకు తాము సానుకూలంగా ఉన్నా లిఖితపూర్వక ఆదేశాలేవీ ఇవ్వబోమన్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వానిదే ఈ విషయంలో తుది నిర్ణయమని కేంద్ర మంత్రి వెల్లడించినట్లు తెలిసింది. కేంద్రమంత్రి చెప్పింది కూడా సబబుగానే ఉందని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించినట్లు సమాచారం. దీనిపై తుది నిర్ణయం తీసుకుని మేఘాకే పనులు అప్పగించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
పోలవరం ఆలస్యంతో ఇప్పటికే ఎంతో నష్టపోయామని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌ను పరుగులుపెట్టించాలన్న యోచనతో ఉన్నారు. అందుకే నవంబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ నష్టపోకుండా ప్రాజెక్టు పనులు పూర్తిచేసేందుకు డిజైన్లను ఆమోదించి ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. డయాఫ్రం వాల్ దెబ్బతిన్నప్పుడు 2022లో మరమ్మతుల కోసం టెండర్లు పిలిచినప్పుడు 29 వేల చదరపు మీటర్ల వాల్ పనులను 390 కోట్లకు చేయడానికి మేఘ సంస్థ ముందుకొచ్చిందని కానీ ఇప్పుడు మరమ్మతులు కాకుండా ఏకంగా 73వేల క్యూబిక్ మీటర్లతో కొత్తదే నిర్మించాల్సి ఉందన్నారు.
అవే ధరలతో చేయడానికి మేఘ సంస్థ అంగీకరించడంతో నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని అధికారులంతా అభిప్రాయపడినట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు. డయాఫ్రంవాల్‌కు నష్టం జరగడానికి గత ప్రభుత్వం తీసుకున్న అసమర్థ నిర్ణయాలే తప్ప ఏజెన్సీది ఎలాంటి తప్పులేదన్నారు. సకాలంలో ఎగువ కాఫర్‌డ్యాం నిర్మాణం పూర్తిచేయకపోవడం వల్లే ఆ గ్యాప్‌ల్లో నుంచి వరద నీరు సుడులు తిరుగుతూ రావడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని నిపుణులు చెప్పినట్లు మంత్రి వెల్లడించారు.