Chandrababu Davos Tour Updates : గ్రీన్ హైడ్రోజన్‌తోపాటు హరిత ఇంధన రంగంలో ఆంధప్రదేశ్‌ను అగ్రగామిగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బదులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తమ విధానమని వెల్లడించారు. దావోస్‌లో రెండోరోజు పర్యటనలో భాగంగా భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి స్వర్ణాంధ్ర-2047 విజన్ టాస్క్‌ఫోర్స్ సభ్యులు టాటాసన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ సహా సీఐఐ చైర్మన్ చంద్రజీత్ బెనర్జీ తదితరులు హాజరయ్యారు.
ప్రస్తుతం వందకు పైగా దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారని అత్యంత నాణ్యమైన మానవ వనరుల లభ్యతలో ఏపీ అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నారని, తమ ప్రతిభతో రాణిస్తున్నారని చెప్పారు. 25 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ ఇంటర్నెట్ ప్రవేశపెట్టారని, 1991లో భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ రెండింటిని అవకాశంగా తీసుకుని ఏపీలో రెండో దశ సంస్కరణలు అమలు చేశామని వాటి ఫలితాలు ఇప్పుడు వచ్చాయని సీఎం అన్నారు.
'సరైన సమయమంలో దేశానికి సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారు. చాలా దేశాల్లో రాజకీయ సందిగ్ధత ఉందని భారతదేశంలో అలాంటి గందరగోళ పరిస్థితి లేదు. గతంలో నేను అమలు చేసిన సంస్కరణలతోనే రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. గ్రూప్ ఆఫ్ కాన్సెప్ట్ రూపొందించడంలో ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు దేశంలో నివాసయోగ్యానికి హైదరాబాద్ అత్యంత అనువైనం ప్రాంతంగా తీర్చిదిద్దాం' అని చంద్రబాబు పేర్కొన్నారు.
"జీడీపీ వృద్ధి రేటులోభారతదేశం అగ్రగామిగా ఉందని, ఇదే స్థాయిలో వృద్ధి నమోదు చేస్తామనే నమ్మకం ఉంది. 2028 నుంచి భారత్ యుగం ప్రారంభమవుతుంది. దేశాన్ని ప్రపంచంలో సూపర్ పవర్‌గా చేసేందుకే వికసిత్ భారత్-2047 ప్రణాళికలను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారు. సంపద సృష్టిలో భారతీయులు అగ్రగామిగా ఎదగడం ద్వారా 2047 నాటికి భారత్ తొలి రెండు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
Chandrababu on Green Industrialization : స్వర్ణాంధ్ర–2047 విజన్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పది మార్గదర్శక సూత్రాలను ముఖ్యమంత్రి వివరించారు. కాస్ట్ ఆప్టిమైజేషన్, పర్యావరణ సమతుల్యతపై దృష్టి పెట్టి గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్, ఫ్యూయల్ మార్కెట్‌ల్లో ఏపీని అగ్రగామిగా చేస్తున్నామని చెప్పారు. కాకినాడ వంటి పటిష్టమైన ఓడరేవుల ద్వారా ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ రూపకల్పనలో టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మార్గనిర్దేశాన్ని మరిచిపోలేమన్నారు.