CM Chandra Babu Naidu Review On GSWS:గ్రామ-వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సమర్థవంతమైన సేవలు అందించేలా తీర్చిదిద్దే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి మరింత పటిష్టంగా తయారు చేసి ప్రజలకు ఉపయోగకరంగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో జీఎస్‌డబ్ల్యూఎస్ పై సీఎం సమీక్ష నిర్వహించారు.
'అవసరమైన వారికి బసవతారకం ఆస్పత్రిలో ఉచిత చికిత్స'
ప్రజలకు మరింత చేరువయ్యేలా:గ్రామాలు, పట్టణాలు, నగర ప్రాంతాల్లో సైతం సచివాలయాలు ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మెరుగైన సేవలు అందించాలనే దానిపై ప్రధానంగా అధికారులతో ఆయన చర్చించారు. సచివాలయ వ్యవస్ధ పునర్ వ్యవస్థీకరణ ప్రధాన అజెండాగా జరిగిన సమావేశంలో వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా అత్యుత్తమ ప్రజాసేవలు అందించడంతో పాటు సచివాలయ ఉద్యోగులకు కూడా ఒక క్రమబద్ధమైన బాధ్యతలు కల్పించి ఈ వ్యవస్ధను సమర్థవంతంగా ఉపయోగించుకునే అంశంపై చర్చించారు. మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు ఉద్యోగుల అవసరాలు, సౌకర్యాల అంశం కూడా చర్చకు వచ్చింది. సచివాలయ ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని ఉండటం సరికాదని అందరికీ సమానమైన పని బాధ్యత ఉండేలా చూడాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ కార్యకలాపాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్థుబాటు, శిక్షణ వారికి ఇవ్వాలని సమావేశంలో ఆయన చర్చించారు.