Citizens for Democracy Meeting: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్లను ఎన్నికల విధుల్లోంచి పక్కన పెట్టాలన్నారు. పింఛన్, రేషన్‌తో పాటు పౌరులతో వాలంటీర్లను దూరం చేస్తేనే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయన్నారు. ఓటర్లు చైతన్యంగా, నిర్భయంగా బయటికి వచ్చి తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు.
విజయవాడ బందరు రోడ్డులోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసి ఆధ్వర్యంలో 'స్వేచ్ఛాయుత ఎన్నికలు- అవినీతికి అడ్డుకట్ట' అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసీఐ ఎన్నికల వ్యయాల పూర్వ డీజీ పీకే డాష్, వక్తలుగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, సీఎఫ్‌డీ సంయుక్త కార్యదర్శి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.
దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఓటు హక్కు ప్రాధాన్యతపై వక్తలు ప్రసంగించారు. రానున్న ఎన్నికలు హింసాయుత వాతావరణంలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. పోలీసులు దేశ ప్రధాని భద్రతనే విస్మరిస్తే సామాన్య ప్రజలకు రక్షణ ఎవరు? అని ప్రశ్నించుకోవాల్సి అవసరం ఉందన్నారు.
కోడ్ ఉల్లంఘన - తిరుపతిలో యథేచ్ఛగా జాతీయ జెండా స్థూపం నిర్మాణ పనులు - YSRCP Violates Election code
ప్రధాని సభ ముగిసిన 24 గంటల్లోపు ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి చంపారని, మరో ప్రాంతంలో ఒక కారును ధ్వంసం చేశారని చెప్పారు. దీనిపై ముగ్గురు జిల్లా ఎస్పీలను ప్రధాన ఎన్నికల అధికారి ప్రశ్నించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మనం ఏ యుగంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని వాపోయారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, భద్రతా వ్యవస్థ, పౌరుల్లో నెలకొన్న ఆందోళనతో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగవని నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ పౌరుడు గతంలో ఎవరికి ఓటు వేశారు? వారి సామాజిక నేపథ్యం, వృత్తి వంటి అన్ని వివరాలను ప్రభుత్వం వాలంటీర్లద్వారా సేకరించిందని నిమ్మగడ్డ రమేష్ అన్నారు. ఇది నేరపూరితమైన కుట్రని, పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కల్గించడమేన్నారు. రాజ్యాంగం సమాన హక్కులు కల్పించినా పోలీసు వ్యవస్థ మాత్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.
యథేచ్ఛగా వైఎస్సార్సీపీ కోడ్ ఉల్లంఘన- ఈసీ ఆదేశాలు బేఖాతరు!
రాష్ట్రంలో స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితులు కూడా లేవన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో తిరుపతిలో 35వేల దొంగ ఓట్లు వేశారని, ఇలా పలు కారణాలతో రాష్ట్రంలో ప్రజాస్యామ్యం విషమ పరిస్థితిలో పడిందన్నారు. ఎక్కడైతే మానవహక్కులు ఉల్లంఘన, ఎన్నికల్లో పారదర్శకత లోపిస్తుందో అక్కడ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఈసీఐ ఎన్నికల వ్యయాల పూర్వ డీజీ పీకే డాష్ తెలిపారు.
మన దేశంలో జనాభా చాలా ఎక్కువగా ఉందని, కానీ ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని చాలా మంది విదేశీ మేధావులు ఎద్దేవా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న దేశాలకంటే మేటిగా గత 75 సంవత్సరాలుగా విజయవంతంగా ఎన్నికలు నిర్వహస్తూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలుస్తూ వస్తోందన్నారు. రాజకీయ పార్టీల బ్యాంకు ఖాతాల్లో అన్ని వేల కోట్ల డబ్బు ఎక్కడ నుంచి వస్తోందని ప్రశ్నించారు.
ఎన్నికల్లో నిష్పక్షపాతం కోసమే ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు. ఎన్నికల్లో కండ, యంత్ర బలాలు డబ్బుపై ఆధారపడతాయన్నారు. ఎన్నికల చట్టం ప్రకారం తాయిలాలు ఇవ్వడం, తీసుకోవడం, ఇస్తామని హామీ ఇవ్వడం కూడా నేరమేనన్నారు. ఉచిత హామీలు మ్యానిఫెస్టోలో పెడితే వాటి అమలుకు నిధులు ఎక్కడ నుంచి సమకూరుస్తారో సైతం అభ్యర్థులు ఈసీకి తెలియజేయాలన్నారు.
అనంతపురం జిల్లాలో వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు - ఐదుగురిని తొలగించిన ఎన్నికల సంఘం - Authorities Dismiss Five Volunteers
ఎన్నికలు ఎప్పుడైతే స్వేచ్ఛగా జరుగుతాయో అప్పుడే ప్రజాభిప్రాయం వెల్లడయ్యే అవకాశం ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మేయర్ జంధ్యాల శంకర్ తెలిపారు. కానీ దేశంలో దానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు విపరీతమైన ధన, అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారని చెప్పారు.
చట్టసభలలో విలువైన సలహాలు ఇచ్చే స్థోమత, సేవ చేయాలన్న ఆసక్తి ఉండి కూడా మధ్యతరగతి వారు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎన్నికల వరకు హడావుడి చేసే పోలీసులు చివరి రెండు రోజులు కళ్లు మూసుకుంటున్నారని పేర్కొన్నారు. అవినీతే సర్వాంతర్యామిగా ఉందన్నారు.
తాము మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడంపై చాలా సంతోషంగా ఉందని సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు తెలిపారు. రాజకీయ నాయకులు ఎన్నికల సమయలో చాలా హమీలు ఇస్తున్నారని, వాటిని పరిశీలించిన తర్వాత ఎవరికి ఓటు వేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నేడు హమీలు ఇస్తున్నవారు గతంలో ఎన్ని హమీలను అమలు చేశారన్న అంశమే కీలంగా ఉంటుందన్నారు. తమ భవిష్యత్‌కు ఎవరు భరోసా ఇస్తారో వారికే మద్దతు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.