AP CID Probe Extortion in Purchase Liquor : జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్లలో వేల కోట్లు కొల్లగొట్టినట్లు సీఐడీ గుర్తించింది. నాటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు, అస్మదీయులైన వారి బినామీలతో పాటు, నిర్దేశిత కమీషన్లు చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే 90 శాతానికి పైగా కొనుగోలు ఆర్డర్లు కట్టబెట్టినట్లుగా దర్యాప్తులో తేల్చింది. ఆ సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యానికి చెల్లించే బేసిక్ ప్రైస్‌ను అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ధి కలిగించినట్లు సీఐడీ నిర్ధారణకు వచ్చింది.
విజయవాడ ప్రసాదంపాడులోని బెవరేజస్ కార్పొరేషన్, డిస్టిలరీస్, బ్రూవరీస్ విభాగాల్లో వరుసగా రెండో రోజూ విస్తృతంగా అధికారులు తనిఖీలు చేపట్టారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన కొనుగోలు ఆర్డర్లు, వారికి ఖరారు చేసిన బేసిక్ ప్రైస్, వారికి చెల్లించిన బిల్లులు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. తద్వారా దోపిడీ జరిగిన తీరు అధికారులు గుర్తించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం, పార్టీలో నంబర్- 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. అక్కడినుంచే జే బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లు, ఇక్కడ తయారు చేసిన మద్యానికే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు లభించినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైందని, ఇది ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్‌రెడ్డి బినామీ సంస్థ అని గుర్తించింది. దీనికి సొంతంగా ఒక్క డిస్టిలరీ లేకపోయినా విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఏస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లను సబ్‌లీజు పేరిట బలవంతంగా ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను సరఫరా చేసినట్లు ఆధారాలను సేకరించింది.
AP Liquor Scam Updates : ఏపీఎస్‌బీసీఎల్ వద్ద మొత్తం ఎన్ని మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి? గత ఐదేళ్లలో ఎంత విలువైన, ఎంత పరిమాణం మద్యాన్ని ఆయా కంపెనీల నుంచి ఏపీఎస్‌బీసీఎల్ కొనుగోలు చేసింది? అందుకు ఏ విధానాన్ని అనుసరించిందనే వివరాల్ని దస్త్రాల ఆధారంగా సీఐడీ విశ్లేషించగా దోపిడీ గుట్టంతా బయటపడింది. వందకు పైగా మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టైరై ఉండగా అందులో ఓ 10 సంస్థలకే 90 శాతానికి పైగా కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. వీటిల్లో కొన్ని కంపెనీలకు అసలు సొంత డిస్టిలరీలే లేవని, ఇతరులకు చెందిన వాటిలో పాగా వేసి అక్కడ జే బ్రాండ్లు ఉత్పత్తి చేశాయని గుర్తించింది.