Child Marriage Took Place in Warangal District :వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తనకంటే మైనర్ బాలికనుపెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ములుగు జిల్లాకు చెందిన 15 సంవత్సరాల బాలికను రాయపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 30 సంవత్సరాలు దాటిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరి పెళ్లి విషయం ఆ నోట ఈ నోట పడి అధికారుల వరకు చేరడంతో వరంగల్ జిల్లా బాలల రక్షణ అధికారులు సదరు వ్యక్తి నివాసాన్ని పరిశీలించారు.
పెళ్లి చేసుకున్న బాలికను వివరాలు అడిగి తెలుసుకున్న అధికారులు ఆమె చెప్పిన వివరాలతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. చుట్టుపక్కన వారి దగ్గర కొంత సమాచారం తెలుసుకున్నారు. చిన్న వయసులో పెళ్లి ఏంటని బాలికకు సర్ది చెప్పి తమ వెంట తీసుకెళ్లారు. తనను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (Child Welfare Committee) ముందు హాజరు పరిచారు. చిన్న వయసులో వివాహం చేసుకుంటే ఎదురయ్యే కష్టాలు, జరిగే నష్టాలపై బాలికకు వివరించారు. అధికారుల కౌన్సిలింగ్ అనంతరం సదరు బాలికను స్థానికంగా ఉన్న ఆశ్రమంలో ప్రొటెక్షన్ (Child Protection) కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు. వివాహం చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Warangal Child Marriage :చిన్నతనంలో వివాహాలు చేసుకోవడం చట్టరీత్యా నేరమైనప్పటికీ కొందరు దుర్బుద్ధితో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇంచార్జ్ డి.రాజు ఐసీడీఎస్ సూపర్ వైజర్ సీహెచ్ విజయలక్ష్మి, లీగల్ ఆఫీసర్ సురేష్ కౌన్సిలర్ నరసింహస్వామి, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ కె.స్వేత తదితరులు పాల్గొన్నారు.