Chicken Biryani for 3 Rupees in Jangareddygudem:నూతన వ్యాపారాన్ని మార్కెట్లో విశేష ప్రచారం కల్పించాలని దృక్పథంతో ఓ వ్యక్తి చేసిన వినూత్న ఆలోచనకు విశేష స్పందన లభించింది. అనుకున్న దానికన్నా రెండు మూడు రెట్లు పైగా జనం వారి వ్యాపార సముదాయం ముందు బారులు తీరారు. ఏమిటా వ్యాపారం, ఏమిటా ఆలోచన అని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఏలూరు జిల్లాలో ఓ హోటల్ ప్రారంభోత్సవ ఆఫర్‌గా కేవలం 3 రూపాయలకే బిర్యానీ అని ప్రకటించింది. ఈ ఆఫర్ గురించి తెలిసి ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. ఆ హోటల్ ప్రాంతంలో వందలాది వాహనాలు పార్క్ చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 3 రూపాయలకే బిర్యానీ అంటూ నగరంలో విస్తృతంగా ప్రచారం చేశారు. తెల్లవారు జాము నుంచే హోటల్ వద్దకు ప్రజలు క్యూ కట్టారు. ఈ ఆఫర్‌కి టైమ్ లిమిట్ పెట్టినా అనుకున్న సమయానికి ముందే బిర్యానీ కోసం బారులు తీరారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జన సందోహంగా మారిన రెస్టారెంట్ ప్రాంగణం: జిల్లాలోని జంగారెడ్డిగూడెం పట్టణంలో నలుగురు వ్యక్తులు కలిసి ఓ రెస్టారెంట్‌ను శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను పెట్టడంతో పట్టణ ప్రజలు బారులు తీరారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో కేవలం 3 రూపాయలకే బిర్యానీ అని ప్రత్యేక ఆఫర్ పెట్టడంతో రెస్టారెంట్ ప్రాంగణం జన సందోహంగా మారింది.