CHARLAPALLI RAILWAY TERMINAL OPENING DATE: చర్లపల్లి రైల్వే టెర్మినల్ తెలంగాణకు మరో మణిహారం కానుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సుమారు 430 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈనెల 28వ తేదీన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు.
అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం:చర్లపల్లి రైల్వే స్టేషన్ భవనంలో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్ట్‌లు, 7 బుకింగ్ కౌంటర్లతో పాటు పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, హైక్లాస్ వెయిటింగ్ ప్రదేశం, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్‌లో కేఫ్టేరియా, రెస్టారంట్, రెస్ట్‌రూమ్ సౌకర్యాలు ఉన్నాయి. కొత్త డిజైన్‌లో ప్రయాణికుల రాకపోకలకు విశాలమైన స్థలంతో పాటు ముందువైపు ప్రకాశవంతమైన లైటింగ్‌తో అద్భుతమైన ఎలివేషన్‌ను రూపొందించారు.
ప్రయాణికులకు ఉచితంగా వైఫై సదుపాయాన్ని కల్పించనున్నారు. హైదరాబాద్ శివారులోని ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తరువాత, పలు టైన్లు ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి. తద్వారా జంటనగరాల్లోని మెయిన్ రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ తగ్గించాలని రైల్వే శాఖ చూస్తోంది.
ఆ స్టేషన్‌లలో తగ్గిపోనున్న ప్రయాణికుల రద్దీ: కొద్ది రోజుల్లో ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తుండటంతో, నగరంలోని నాంపల్లి, కాచికూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గిపోనుంది. చర్లపల్లి స్టేషన్ నుంచే నగరం నలుమూలలకు ప్రయాణికులు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా కొత్తగా మరో 25 టైన్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. ఈ స్టేషన్ నుంచి లక్షల్లో ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు. దీంతో ఇప్పటికే ప్రభుత్వం రవాణా వ్యవస్థను సైతం మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టింది.
ప్రయాణికుల భద్రతకు పెద్దపీట:మరోవైపు ఈ స్టేషన్లో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేశారు. భారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి 500ల చెట్లను తీసుకువచ్చి ట్రాన్స్ లొకేషన్ ప్రక్రియ ద్వారా నాటారు. కోచ్ వాషింగ్ చేసిన నీటిని తిరిగి పునర్వినియోగం చేసేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూగర్భజలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉన్న 5 ప్లాట్ ఫాంలకు అదనంగా మరో 4 ప్లాట్ ఫాంలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
సరికొత్తగా సికింద్రబాద్ రైల్వే స్టేషన్ - 2026 నాటికి ఎలా ఉంటుందో తెలుసా? - Secunderabad station modernisation