Chandrababu First Sing on Mega DSC : ఆంధ్రప్రదేశ్‌ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు అంతేస్థాయిలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ మొదటి 5 సంతకాలను ఇవాళ చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తారు. ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేయనున్నారు. నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపైనా సంతకాలు పెట్టనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లో ఈరోజు సాయంత్రం 4:41 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోనున్నారు.
నిరుద్యోగ యువతకు వరంగా డీఎస్సీ : ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ నిర్వహణ దస్త్రంపై చేయనున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీలపై గత 2-3 రోజులుగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఆయా విద్యాసంస్థల్లో 13,000లకు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా నివేదిక రూపొందించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి, అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
రాకాసి చట్టానికి చెల్లుచీటీ:ప్రజలను అత్యంత భయకంపితుల్ని చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేయనున్నారు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి జగన్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31న తీసుకొచ్చింది. ఈ చట్టం ముసుగులో కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లను రూపొందించారు. కబ్జా చేసిన ఆస్తులకు చట్టబద్ధత తెచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ పెద్దలు పావులు కదిపారు. ఈ చట్టాన్ని చూసిన న్యాయాధికారులు, న్యాయమూర్తులు సైతం ముక్కున వేలేసుకున్నారు.
సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు, మేధావులు, నిపుణులు గొంతు చించుకున్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పైగా దీన్నే అమలు చేస్తామంటూ వైసీపీ నేతలు స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. జగన్ ఫోటో ముద్రించిన పాసుపుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించివేసి ప్రజలకు భరోసానిచ్చారు.