Chandrababu Reaction on AP Elections:మండుటెండలను లెక్కచేయకుండా ఓటింగ్‌లో పాల్గొంటున్న రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ సృష్టిస్తోన్న అడ్డంకుల్ని అధిగమించి మరీ ఓటింగులో పాల్గొనడం అభినందనీయమన్నారు. వివిధ జిల్లాల్లో వైసీపీ అరాచకాలను తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎదురిస్తూ ముందుకు సాగుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీకి తమ ఓటుతో బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు.
అల్లర్లకు తెగబడుతున్నారు: ఓటమి భయంతో మాచర్ల, రైల్వేకోడూరు, పుంగనూరులో వైసీపీ పేట్రేగిపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. సిరా చుక్క పడాల్సిన చోట రక్తపు చుక్కలు పడేలా చేశారని దుయ్యబట్టారు. క్యూలైన్‌లో రమ్మన్నందుకు తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ దాడి దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు, దౌర్జన్యాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని హెచ్చరించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసీపీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. ఓటమి ఖాయమని నిర్ధారణవ్వడంతో అల్లర్లకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల దౌర్జన్యకాండను ఎన్నికల వేళ కూడా కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. దాడులు, హత్యాయత్నాలతో ముందస్తుగానే ఓటమిని ఒప్పుకున్నారన్నారు.
తక్షణమే చర్యలు తీసుకోవాలి: పుంగనూరు, మాచర్ల, రైల్వేకోడూరు, మైదుకూరు, ఆమదాలవలస, తాడికొండలో కూటమి ఏజెంట్లపై దాడి దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. తక్కెళ్లపాడు పోలింగ్ స్టేషన్లో ఎస్సీ మహిళలపైకి ఎంపీ అభ్యర్ధి కిలారు రోశయ్య కారుతో దూసుకు రావడం హేయమని విమర్శించారు. బాధ్యులపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలింగ్ ప్రారంభమైనప్పటికీ జగన్ రెడ్డి పేరుతో ఓటర్లకు ఐవీఆర్ఎస్ ( IVRS ) కాల్స్ వస్తున్నాయని వాటిని నిలువరించాలని విజ్ఞప్తి చేశారు.