Central Sahitya Akademi Award to Writer Penugonda Lakshminarayana :ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ‘దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి’కిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. పెనుగొండ లక్ష్మీనారాయణ గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 1972 నుంచి అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించి, 2023లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. 1972లో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
సాహిత్య అకాడమీ దేశ వ్యాప్తంగా 21 భాషలకుగాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను బుధవారం ప్రకటించింది. వీటిలో ఎనిమిది కవితలు, మూడు నవలలు, రెండు లఘు కథలు, మూడు వ్యాస సంపుటిలు, మూడు సాహిత్య విమర్శకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. నాటక, పరిశోధన అంశాలకు సంబంధించి ఒక్కో పుస్తకం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యాయి. బెంగాలీ, ఉర్దూ, డోగ్రి భాషలకు తర్వాతి దశలో అవార్డులు ప్రకటించనున్నారు.