Central Minister Pemmasani Review With Railway Authorities:గుంటూరు రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రైల్వేశాఖ అధికారులతో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఫ్లైఓవర్లపై సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. గత ఐదు సంవత్సరాల పాలనలో రైల్వే ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆరోపించారు. ఇప్పుడు వాటిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైల్వే ప్రాజెక్టులతో ఓట్లు రావని జగన్ పట్టించుకోలేదని పెమ్మసాని విమర్శించారు.
జిల్లా పరిధిలో దాదాపు 2 వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో రైల్వే బ్రిడ్జిల పరిస్థితులపై అధికారులతో చర్చించామని పెమ్మసాని పేర్కొన్నారు. గుంటూరు శంకర్ విలాస్ వద్ద పైవంతెన నిర్మాణంపై అధికారులతో చర్చించామన్నారు. నిర్దేశిత కాలపరిమితి ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించినట్లు చెప్పారు. జిల్లాలోని 15 రకాల వంతెనలపై అధికారులతో మాట్లాడామని ఆయన స్పష్టం చేశారు. పనులు ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్దేశించామన్నారు.