ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు అడ్వాన్స్‌ - 75% ఖర్చు చేస్తేనే తదుపరి నిధులు - CENTRAL GOVT FUNDS FOR POLAVARAM

కేంద్ర బడ్జెట్‌లోని కంటింజెన్సీ ఫండ్‌ నుంచి అడ్వాన్సుగా నిధులు

CENTRAL_GOVT_FUNDS_FOR_POLAVARAM
CENTRAL_GOVT_FUNDS_FOR_POLAVARAM (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2024, 9:54 AM IST

Central Govt Releases Funds for Polavaram :పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.2,348 కోట్లు అడ్వాన్సుగా విడుదల చేసింది. ఆ నిధుల వినియోగానికి సంబంధించి కేంద్రం కొన్ని షరతులు విధించింది. ప్రస్తుతం ఇచ్చిన మొత్తంలో 75 శాతం ఖర్చు చేస్తేనే తదుపరి నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. ఇచ్చిన నిధులను నిర్దేశిత పనులకే వినియోగించాలని సూచించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేసిన పనులకు రీయింబర్స్‌మెంట్‌ కింద మరో రూ. 459 కోట్లు విడుదల చేసింది.

తొలిసారిగా అడ్వాన్స్‌ నిధులు :పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం కేంద్ర జల శక్తి శాఖ తొలిసారిగా అడ్వాన్స్‌ నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,348 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ నిధులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఖాతాకు సర్దుబాటు చేయాలని సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ డీసీ భట్‌ దిల్లీలోని ప్రిన్సిపల్‌ ఎకౌంట్స్‌ అధికారికి లేఖ రాశారు. రెండు రోజుల క్రితమే ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకోగా దానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలిచ్చింది.

పోలవరానికి అడ్వాన్స్​ పద్దు - ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు అడుగులు

కంటింజెన్సీ ఫండ్‌ నుంచి అడ్వాన్స్​ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లోని కంటింజెన్సీ ఫండ్‌ (Contingency Fund) నుంచి అడ్వాన్సుగా నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. నాబార్డు రుణం ద్వారా కాకుండా కేంద్ర బడ్జెట్‌ నుంచే నిధులిస్తున్నారు. మరో 2 కేటగిరీల కింద కూడా గతంలో చేసిన ప్రాజెక్టు పనులకు కేంద్ర జల శక్తి శాఖ నిధులు రీయింబర్స్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక కేటగిరీలో రూ.383.227 కోట్లు, మరో కేటగిరీలో రూ.76.463 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మొత్తం 2,807 కోట్లు విడుదలయ్యాయి.

నిధుల ఖర్చుపై షరతులు :అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి కొన్ని షరతులు విధించింది. ప్రస్తుతం ఇచ్చిన రూ. 2,348 కోట్లలో 75 శాతం నిధులు ఖర్చు చేస్తేనే తదుపరి విడత నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విడత నిధులు విడుదల చేయాలంటే నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పోలవరం నిర్మాణ పనులు జరగాలని సూచించింది. ఆలస్యమైతే స్పష్టమైన కారణాలు గుర్తించాలని పేర్కొంది. వాటిని చక్కదిద్దేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో రాష్ట్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జల శక్తి శాఖకు తెలియజేయాలని సూచించింది.
"రూ.2,800 కోట్లు తీసుకోండి" - పోలవరం పనులకు తొలిసారిగా అడ్వాన్స్ ఇచ్చిన కేంద్రం

నిర్దేశిత పనులకే వాటిని వినియోగించాలి :పోలవరం పనులు పూర్తి చేసేందుకు సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన, రాష్ట్రప్రభుత్వం అంగీకరించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టు సవరించిన నిర్మాణ షెడ్యూల్‌ను ఒప్పందంలో పొందుపర్చాలని తెలిపింది. ప్రస్తుతం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ నిధులను ఒప్పందంలో పేర్కొన్న పనులకే వెచ్చించాలని స్పష్టం చేసింది. నిర్దేశిత పనులకే నిధులను వినియోగించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ధ్రువీకరణ పత్రాలు తీసుకొవాలి. ఆ ధ్రువీకరణ పత్రాలను కేంద్ర జలశక్తిశాఖకు పంపాలని పేర్కొంది. ఈ నిధులకు సంబంధించిన ఖాతాలు కాగ్‌ అధికారులకు అందుబాటులో ఉంచాలన్న కేంద్రం ప్రతీ త్రైమాసికంలో ప్రాజెక్టు ఆర్థిక పురోగతిపై కేంద్రానికి అథారిటీ నివేదికలు సమర్పించాలని తెలిపింది.

పోలవరం మాజీ స్పెషల్ కలెక్టర్​పై క్రమశిక్షణ చర్యలు - 10 రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశం

ABOUT THE AUTHOR

...view details