Muppalla Village as National Best Gram Panchayat : ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. 2024గాను ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డును ముప్పాళ్ల గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రం నుంచి వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన నాలుగు గ్రామ పంచాయితీలను ఎంపిక చేయగా అందులో ముప్పాళ్ల ఒకటి. జాతీయ స్థాయిలో ముప్పాళ్ల గ్రామాన్ని సామాజిక న్యాయం, సోషల్ సెక్యూరిటీ పంచాయతీ విభాగంలో అవార్డుకు ఎంపిక చేశారు.
కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ నేడు (బుధవారం) దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాన్ని ముప్పాళ్ల గ్రామ సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ, అధికారులు స్వీకరించారు. అలాగే చిత్తూరు జిల్లా బొమ్మసముద్రం, అనకాపల్లి జిల్లా న్యాయంపూడి, అనకాపల్లి జిల్లా తగరంపూడి పంచాయితీలు జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను అందుకున్నాయి.
పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ - నీళ్లు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం పనులు వేగవంతం
ముప్పాళ్లమ్మ తల్లి అమ్మవారి పేరుమీద ముప్పాళ్ల అనే పేరు వచ్చింది. ఈ గ్రామంలో 5,877 మంది జనాభా ఉండగా 1658 ఇళ్లు ఉన్నాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు రెండు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, మరొక మండ పరిషత్ ప్రాథమిక ఎలిమెంటరీ పాఠశాల ఉన్నది. గ్రామపంచాయతీ సంవత్సరాదాయం 9 లక్షల రూపాయలుగా ఉంది. నందిగామ నుంచి ముప్పాళ్లకు 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూర్తిగా గ్రామస్థులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు.
గత 15 ఏళ్ల నుంచి గ్రామంలో పలు పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. అందులో ప్లే వుడ్ చెక్కలు తయారీ పరిశ్రమ, బస్సులు బాడీ బిల్డింగ్ తయారీ, అలాగే గ్లాస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గ్రామ సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ బలపరిచిన కుసుమరాజు వీరమ్మ ఎన్నికయ్యారు. గత నాలుగేళ్ల నుంచి సర్పంచ్ గా ఆమె గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే గ్రామంలో చాలావరకు సిమెంట్ రోడ్లు నిర్మించారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంచాయతీలకు నిధులు రాకపోవడంతో గ్రామ అభివృద్ధి కుంటుపడింది.