ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"కాల్స్, మెసేజ్​లతో కోట్ల సంపాదన" - సైబర్​ నేరస్థుల వేటలో "ఏఐ" - HOW TO CONTROL CYBER CRIMES

సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ - సెల్‌ఫోన్‌ ప్రొవైడర్లు, బ్యాంకుల్లో కృత్రిమమేధ

how_to_control_cyber_crimes
how_to_control_cyber_crimes (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2024, 6:49 AM IST

Cyber Crime Control AI Technology : సామాన్యులు, సంపన్నుల తేడాలేదు.. పల్లెలు, పట్టణాలనే భేదం లేదు.. ప్రజలను మాయమాటలతో భయపెట్టి, బెదిరించి వివిధ మార్గాల్లో నిలువునా లూటీచేస్తున్న సైబర్‌ నేరగాళ్లను అదుపుచేసే ప్రయత్నాలు పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నేరం జరిగిన తర్వాత దర్యాప్తు జరపడం కంటే నేరం జరగకుండా జాగ్రత్తపడటం ముఖ్యం అనే ఉద్దేశంతో ఆయా సంస్థలు ముందస్తు చర్యలకు ఉపక్రమిస్తున్నాయి.

వైద్యుడిని భయపెట్టి రూ.33 లక్షలు దోచేసిన సైబర్ నేరగాళ్లు - Cyber Crime in Satya Sai District

ఇంతవరకు పోలీసులు ఇలాంటి బాధ్యత తీసుకోగా ప్రస్తుతం సెల్‌ఫోన్‌ ప్రొవైడర్లు, బ్యాంకులు రంగ ప్రవేశం చేశాయి. సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ పెట్టేందుకు కృత్రిమమేధ (AI) సాయంతో ప్రత్యేక ప్రోగ్రామ్స్‌ సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో కేవలం 10 రోజుల వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల అనుమానాస్పద కాల్స్‌ గుర్తించినట్లు ప్రముఖ సంస్థ ఎయిర్‌టెల్‌ అధికారికంగా వెల్లడించింది. దీన్నిబట్టి సైబర్‌ నేరగాళ్లు ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల్లో ఒక్క తెలంగాణలోనే సైబర్‌ నేరగాళ్లు దాదాపు రూ.1,500 కోట్లు దోచుకోవడం గమనార్హం. అందులో రూ.110 కోట్లు మాత్రమే సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రికవరీ చేయగలిగారు. దోచుకున్న సొత్తులో ఇది పదోవంతు కూడా లేదన్నది వాస్తవం. తమకున్న పరిమితుల దృష్ట్యా పోలీసులు ఇలాంటి నేరాలను అంతగా అదుపు చేయలేకపోతున్నారని తెలుస్తోంది. నేరగాళ్లు ఎక్కడుంటారో?, ఎలాఉంటారో తెలియని పరిస్థితి. కేవలం తప్పుడు పత్రాలతో ఫోన్లు, బ్యాంకు ఖాతాలు తీసుకొని పోలీసులకు ఝలక్ ఇస్తున్నారు. అంతా పరిశోధించి నేరగాళ్ల ఆచూకీ తెలుసుకునేసరికి దోచుకున్న డబ్బు వివిధ రూపాల్లో దేశం దాటిపోతోంది. చివరకు నిందితులు పట్టుబడినా రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారిందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. ఒక తరహా నేరంపై ప్రజల్లో అవగాహన పెరిగేసరికి నేరగాళ్లు మరో కొత్తతరహా మోసాన్ని తెరపైకి తెస్తున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నేరాలు జరగకుండా బ్యాంకులు, సెల్‌ఫోన్‌ ప్రొవైడర్లు రంగంలోకి దిగడం శుభపరిణామం.

ఏఐ అండతో..

సైబర్‌ నేరగాళ్లకు సెల్​ఫోన్లే ప్రధాన ఆయుధం. అదే వారి మార్గం కూడా. ఫోన్‌ ద్వారా బాధితులను సంప్రదించి మాయమాటలతో ముగ్గులోకి దింపుతారు. చివరకు మోసపోయిన బాధితులు తమకు వచ్చిన ఫోన్ నంబర్ ను మాత్రమే పోలీసులకు ఆధారంగా చూపుతున్నారు. ఆ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు చివరకు అది తప్పుడు చిరునామాతో తీసుకున్నట్లు గుర్తించి రద్దు చేయిస్తున్నారు. ఈ తంతంగం అంతా జరిగేపోపు ఆ నంబర్‌ నుంచి ఇంకా ఎంతో మందిని మోసం చేస్తుంటారు. అందుకే మోసపూరిత కాల్స్, మెసేజ్​లు, లింకులు గుర్తించి నివారించడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి సెల్‌ఫోన్‌ ప్రొవైడర్లు నడుం బిగించారు. ఏఐతో సాఫ్ట్‌వేర్‌ రూపొందించి దాదాపు 200 అంశాలను ప్రామాణికంగా తీసుకొని అనుమానాస్పద కాల్స్, సందేశాలను గుర్తిస్తున్నామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఒకే నంబర్‌ నుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వరుసగా కాల్స్‌ వెళ్తుంటే దానిని అనుమానాస్పద నంబర్‌గా గుర్తిస్తున్నారు. కొత్తగా నంబర్‌ తీసుకున్న వెంటనే వరుసపెట్టి కాల్స్‌ చేస్తున్నా, ఎప్పుడూ పెద్దగా ఫోన్‌కాల్స్‌ వెళ్లని నంబర్‌ నుంచి అకస్మాత్తుగా కాల్స్, మెసేజ్​లు పంపిస్తున్నా గుర్తించే సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. ఆయా ప్రమాణాల ఆధారంగా కేవలం 10 రోజుల్లో 12.2 కోట్ల స్పామ్‌ కాల్స్, 23 లక్షల మెసేజ్​లను గుర్తించినట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. వీటిని నిలిపివేయడం, లేదంటే అనుమానాస్పద కాల్, సందేశం అని వినియోగదారులను హెచ్చరించడం చేస్తున్నారు.

బ్యాంకులు కూడా..

సైబర్‌ నేరగాళ్లు తాము దోచుకున్న డబ్బును వేర్వేరు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ముందు ఒకటీ రెండు ఖాతాల్లోకి పంపించి ఆ తర్వాత వాటినుంచి ఒకేసారి వందల ఖాతాల్లోకి మళ్లిస్తుంటారు. బ్యాంకర్లు ఈ ఖాతాలను కట్టడి చేయగలిగితే దోపిడీని అడ్డుకోవడం తేలికైన పనే. కానీ, సైబర్‌ నేరగాళ్లు తప్పుడు వివరాలతో ఖాతాలు తీసుకుంటున్నారు. అక్షర జ్ఞానం లేని అమాయకులకు కమీషన్‌ ఆశ చూపించి వారి ఖాతాలను సైబర్ నేరాలకు వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఖాతాలను గుర్తించేందుకు బ్యాంకులు సైతం ఏఐ ద్వారా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్నాయి. ఖాతా తెరిచిన వెంటనే పెద్దమొత్తంలో డబ్బు వచ్చి పడినా, ఆ ఖాతా వాడకపోయినా, చాలాకాలంగా ఉన్న ఖాతాలో అకస్మాత్తుగా భారీస్థాయిలో లావాదేవీలు మొదలైనా ఏఐ సాఫ్ట్‌వేర్‌ గుర్తించి అలర్ట్ చేస్తుంది. ఇలాంటివి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దాదాపు 3 లక్షల ఖాతాలు గుర్తించి రద్దుచేసింది. ఒకవేళ ఎవరైనా వినియోగదారుడు తన ఖాతా రద్దుచేసినట్లు ఫిర్యాదు చేస్తే వ్యక్తిగతంగా వివరాలు పరిశీలించి తిరిగి పునరుద్ధరిస్తున్నారు. బ్యాంకులు, సెల్‌ఫోన్‌ సంస్థలు కూడా ఇప్పుడు ఇదే బాట పట్టడంతో రాబోయే రోజుల్లో సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు కళ్లెం పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

డాక్టర్​ 'డిజిటల్ అరెస్ట్'!- రూ.2.8 కోట్లు స్వాహా- 'సైబర్' నేరగాళ్ల పనే! - Doctor Cheated By Cyber Frausters

ఆన్​లైన్​​ నేరాలకు చెక్​ పెట్టేలా ప్రభుత్వం వ్యూహాలు - ఇకపై జిల్లాకో సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ - Cyber ​​Crime Police Station in AP

ABOUT THE AUTHOR

...view details