Cases on Sakshi Social Media: సాక్షి న్యూస్ సహా పలువురి సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2019లో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై విజయవాడలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇప్ప టికే నున్న, సూర్యారావుపేట, సైబర్ క్రైం స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజల్లో విభేదాలు సృష్టించి, శాంతిభద్రతల సమస్యలకు కారణమవుతున్నారంటూ పలు సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
ఓ రాజకీయ నేతని అవమానపరిచేలా ఉన్న వ్యాఖ్యలు 'సాక్షి న్యూస్' సామాజిక మాధ్యమం 'ఎక్స్' ఖాతా నుంచి వెలువడ్డాయని పాయకాపురం న్యూ రాజీవ్‌నగర్‌కు చెందిన యువకుడు నున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి సాక్షి న్యూస్‌పై ఈ నెల 20వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణలంక పచ్చమేడ బజారుకు చెందిన మరో యువకుడు 'తెలుగు స్క్రైబ్' ఎక్స్ ఖాతాలో ఓ రాష్ట్రానికి చెందిన నాయకుడిని అవమానపరిచేలా వ్యాఖ్యలు ఉన్నట్లు గుర్తించి, విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపైనా ఈ నెల 20న రాత్రి కేసు నమోదైంది.