రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచిన వైసీపీ- దేశం అస్తిత్వానికే ముప్పు ఏర్పడే పరిస్థితి Cannabis, Drugs Usuage in Andhra Pradesh: జగన్ ఆడుదాం ఆంధ్ర అంటుంటే మత్తు ముఠాలు డ్రగ్స్ వాడుదాం ఆంధ్ర అంటూ చెలరేగుతున్నాయి. అభివృద్ధిపరంగా అన్ని రంగాల్లో ఏపీని అథఃపాతాళానికి తొక్కిన జగన్ గంజాయి ఎగుమతులు, డ్రగ్స్ దిగుమతుల్లో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లి రాష్ట్రాన్ని మత్తువిపత్తు అంచున నిలిపారు.
వైసీపీ పాలనలో అన్ని రంగాలు లాస్ట్ - డ్రగ్స్ స్మగ్లింగ్‌లో దేశంలోనే టాప్ - DRUGS SMUGGLING IN AP
India Siero Leon Drugs: సియోర్రా లియోన్ పశ్చిమ ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం. అంతర్గత కలహాలు, జాతుల మధ్య ఘర్షణలతో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ దేశంలోకి ప్రవేశించిందో మత్తు భూతం దాని పేరే కుష్. యువత ఆ మాదకద్రవ్యం మత్తులోకి జారుకుంది. దేశం అతలాకుతలమైంది. వేల మంది మరణిస్తున్నారు. ఇంకొన్నివేల మంది ఆస్పత్రుల్లో చేరారు. దాన్ని అరికట్టే దారి తెలియక అక్కడ అత్యవసర స్థితి విధించారు. ఇప్పుడా దేశం అస్తిత్వానికే ముప్పు ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌కూ అలాంటి ముప్పే ముంచుకొస్తోందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏపీలో పెరుగుతున్న గంజాయి వినియోగం:ఒక్క ఛాన్స్ అంటూ ఐదేళ్ల క్రితం ఒక మాయలమారి ప్రవేశం ఏపీకి శాపమైంది. అభివృద్ధి ఆగింది. ఉపాధి గల్లంతైంది. పరిశ్రమలు పారిపోయాయి. అంతా అస్తవ్యస్తం. కానీ గంజాయి మాత్రం ఏపీలో ఏ సందుకు వెళ్లినా గుప్పుమంటోంది. విద్యాసంస్థల్లోనూ ఈ మత్తు కమ్మేసింది. చివరకు ఏపీలో గంజాయి కొనడం చిల్లర కొట్టుకెళ్లి చాక్లెట్లు కొన్నంత సులువైపోయింది. ఉక్కుపాదంతో అణచివేయాల్సిన సీఎం జగన్ నీరోచక్రవర్తిలా నిమ్మకున్నారు. కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా ఒక విభాగమైనా ఏర్పాటు చేయలేదు. పర్యవసానంగా ఏపీతోపాటు సరిహద్దు రాష్ట్రాలకూ గంజాయి ఇప్పుడు పెనుసవాల్‌గా మారింది. ఇంకొన్నాళ్లు ఇలాగే కొనసాగితే ఏపీ ఇంకో సియోర్రా లియోన్ అవుతుందేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
జగన్ జమానాలో మాదకద్రవ్యాల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్! - AP become a drug state
రాష్ట్రంలో చాలా చోట్ల వైఎస్సార్సీపీ నాయకులకు గంజాయి వ్యాపారం ప్రధాన ఆదాయ వనరుగా మారింది. విశాఖ మన్యం నుంచి ఏటా 10 వేల కోట్ల విలువైన గంజాయి వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ఇక్కడ సాగయ్యే గంజాయికి అంతర్జాతీయంగా గిరాకీ ఉంది. అందుకే మత్తు ముఠాలు అక్కడ తిష్టవేసి తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తొలుత స్థానిక యువతకు అలవాటు చేసి వారినే సరఫరాదారులుగా మార్చుకుంటున్నాయి. గంజాయిని గోవా తదితర ప్రాంతాలకు పంపి, అక్కడి నుంచి LSD (ఎల్‌ఎస్‌డీ) వంటి మాదకద్రవ్యాలు తెస్తున్నారు. నైజీరియన్ ముఠాల ద్వారా బెంగళూరు సహా ఇతర నగరాలకు సరఫరా చేస్తున్నారు. విశాఖలో కిలో గంజాయి 6 వేలుంటే, గోవాలో 35 వేల వరకూ పలుకుతుంది. గోవాలో 500రూపాయిలకు లభించే ఎల్‌ఎస్‌డీ బ్లాట్ విశాఖలో 2 వేలకు విక్రయిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి లెహంగాల పార్సిల్‌లో మాదకద్రవ్యాలను పెట్టి ఆస్ట్రేలియాకు తరలిస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బెంగళూరులో పట్టుకుంది. గతేడాది ఇద్దరు యువకులు దిల్లీ నుంచి మాదకద్రవ్యాలు తెచ్చి ముఖ్యమంత్రి జగన్ నివసించే తాడేపల్లికి సమీపంలోని వడ్డేశ్వరంలో అమ్మారు. బెంగళూరు నుంచి ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ తెచ్చి విజయవాడలో విక్రయించేందుకు యత్నిస్తూ ముగ్గురు కొన్నాళ్ల క్రితం పట్టుబడ్డారు. గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి సోదరుడి కుమారుడు తరచూ మాదకద్రవ్యాలు సరఫరా చేస్తూ చివరకు పోలీసులకు చిక్కాడు. పోలీసులు ఆయన్ని కేసులో నిందితుడిగా చేర్చకపోవటంతో కొన్నాళ్ల క్రితం లాలాపేట పోలీసుస్టేషన్ పరిధిలోని పలువురు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.దేశమంతా ఉలిక్కిపడేలా వేల కోట్ల మాదకద్రవ్యాలు విదేశాల నుంచి విశాఖకు నేరుగా దిగుమతి అవుతూ ఇటీవల పట్టుబడడం రాష్ట్రంలో డ్రగ్స్ తీవ్రతను చాటుతోంది. దీన్ని దిగుమతి చేసుకున్న సంస్థ కూడా వైసీపీ సంబంధీకులదే.
'వైసీపీ పాలనలో విశాఖ - గంజాయే కాదు అంతర్జాతీయ డ్రగ్స్ కేంద్రంగా మారింది' - Visakha Drug Case
2019 నుంచి 2022 మధ్య రాష్ట్రంలో ఏకంగా 5 లక్షల 33వేల 620 కిలోల గంజాయి పట్టుబడింది. కిలో 10 నుంచి 15 వేల చొప్పున లెక్కేస్తే నాలుగేళ్లలో పట్టుబడిన గంజాయి విలువ 800 కోట్ల రూపాయల పైమాటే. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువే ఇన్ని వందల కోట్లలో ఉందంటే ఇక గుట్టుచప్పుడు కాకుండా ఎంత స్మగ్లింగ్ జరుగుతుందో అంచనా వేసుకోవచ్చు.
అత్యధికంగా గంజాయి పట్టుబడిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 2019, 2021 సంవత్సరాల్లో మొదటిస్థానంలో, 2020లో రెండోస్థానంలో ఉంది. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పనిచేసే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 2021లో దేశవ్యాప్తంగా 7లక్షల 49 వేల 761 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంటే అందులో అత్యధికంగా 2లక్షల 588 కిలోలు ఏపీలోనే పట్టుబడింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు దేశవ్యాప్తంగా 34వేల 2 కిలోల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోగా అందులో సగానికిపైగా అంటే 18 వేల 267 కిలోలు ఏపీలోనే దొరికాయి. పట్టుకున్న వాటిలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఉన్నాయి. 2019 నుంచి 2022 మధ్య 30 వేల 483 మంది ఆత్మహత్యలు చేసుకోగా వారిలో గంజాయి, మాదకద్రవ్యాలు, మద్యం, ఇతర మత్తుపదార్థాలకు బానిసలుగా మారి 1638 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి వంద మందిలో ఐదుగురు మత్తు బానిసలే. డ్రగ్స్ పేరు చెబితే ఒకప్పుడు గుర్తొచ్చే పంజాబ్‌లో నాలుగేళ్లలో 306 మంది మత్తుబానిసలు ఆత్మహత్య చేసుకోగా ఏపీలో అంతకు ఐదున్నరరెట్లుఅధికంగా బలవన్మరణాలు జరిగాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాదకద్రవ్యాల బానిసలుగా మారిన వారిని దాన్నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ కార్యక్రమం అమలు చేస్తోంది. దీని కింద ఏపీలో 2018-19లో 1,752 మంది లబ్ధి పొందగా 2020-21 నాటికి ఆ సంఖ్య ఏకంగా 6వేల878కు పెరిగింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 292.57 శాతం మంది లబ్ధిదారులు పెరిగారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల మత్తులోకి జారుతున్నవారి సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ స్థాయీ సంఘం గతేడాది పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలోనూ ఏపీలో మత్తు ముప్పుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీలో 20 లక్షల 19 వేల మంది మాదకద్రవ్యాలకు అలవాటుపడగా అందులో 4 లక్షల 64 వేల మంది గంజాయికి బానిసలయ్యారు. అందులో 3లక్షల 17వేల మంది 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్కులే. రాష్ట్రంలో అత్యధికంగా 9 లక్షల 86 వేల మంది ఓపియెడ్స్ తరహా డ్రగ్స్‌కు బానిసలుగా మారారు. వీటి తర్వాత గంజాయి వినియోగమే ఏపీలో అధికంగా ఉంది. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో మాదకద్రవ్యాల వినియోగం, ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ జాబితాలో ఉమ్మడి విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలున్నాయి. గంజాయి సాగు, సరఫరాకు విశాఖ మన్యం కేంద్రంగా ఉండగా మిగతా జిల్లాల మీదుగా సరుకు అక్రమ రవాణా సాగుతోంది.