Buses From Tirupati to Madurai: తిరుపతి నుంచి రామేశ్వరం, మదురై, ఊటీ, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో బస్ ప్యాకేజీల ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం జరిగేది. అయితే ప్రస్తుతం ఈ విధమైన దర్శన టిక్కెట్లు రద్దు కావడంతో ఆర్థికంగా నష్టపోయిన పర్యాటకాభివృద్ధి సంస్థ తమకు చెందిన బస్సులను ఇతర మార్గాల్లో వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది.
తిరుపతి నుంచి కోయంబత్తూరు, ఊటీ వయా చెన్నై: ఇందులో భాగంగా భక్తులు, పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్తగా నాలుగు స్పెషల్ బస్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. తిరుపతి నుంచి కోయంబత్తూర్‌కు ప్రతి బుధవారం బస్సు నడపనుంది. అయిదు రోజులపాటు ( 5 డేస్, 4 నైట్స్) యాత్ర ఉంటుంది. దీని టికెట్ ధర పెద్దలకు 4210 రూపాయలు, చిన్న పిల్లలకు 3370 రూపాయలుగా ఉంది.
తిరుపతి నుంచి మైసూరు, ఊటీ వయా బెంగళూరు:మరో ప్యాకేజీలో భాగంగా తిరుపతి నుంచి మైసూర్‌కు ప్రతి బుధవారం బస్సు నడపనున్నారు. ఈ టికెట్ ధర పెద్దలకు 3020 రూపాయలు, చిన్న పిల్లలకు 2420 రూపాయలుగా ఉంది. ఇది కూడా అయిదు రోజుల పాటు కొనసాగనుంది.
తిరుపతి- రామేశ్వరం-కన్యాకుమారి- మధురై- శ్రీరంగం-తిరుపతి వయా చెన్నై: మరో ప్యాకేజీ తిరుపతి నుంతి శ్రీరంగం వరకూ నాలుగు రోజుల పాటు (4 డేస్, 3 నైట్స్) ఉంది. ఇది ప్రతి గురువారం అందుబాటులో ఉంచారు. దీని టికెట్ ధరలు పెద్దలకు 5600, చిన్న పిల్లలకు 4480 రూపాయలుగా నిర్ణయించారు.