Brutal Murder in Tirupati: ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి పద్మావతి నగర్‌లో కలకలం రేపుతోంది. పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వదిన సునీతను హత్య చేసిన మరిది మోహన్ ఆపై 8, 6వ తరగతి చదువుతున్న ఆమె ఇద్దరు పిల్లలు దేవీశ్రీ, నీరజలను హతమార్చాడు. అనంతరం మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్ చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది హత్యలు జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్నారు. తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని ఏఎస్పీ కులశేఖర్ తెలిపారు.
ఆరోజు ఏం జరిగిందంటే:పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం తిరుపతి పద్మావతి నగర్‌లోని ఓ ఇంట్లో టీపీ దాస్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. దాసు తమ్ముడు మోహన్ (35) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 2019లో మోహన్‌కు వివాహం అయింది. అయితే కొన్ని కారణాలతో 2020లో దంపతులు విడిపోయారు. ఇటీవల అన్నావదినలు మోహన్‌కి రెండో పెళ్లి చేశారు. అయితే ఆ అమ్మాయి కూడా మోహన్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో అతను మానసికంగా కుంగిపోయాడు.