BRS Leader Patnam Narender Reddy Arrest : తెలంగాణలో వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అధికారులపై దాడి ఘటనలో కుట్ర ఉందనే ఆరోపణలతో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశారు. కేసులో ఎ-1 నిందితుడిగా ఉన్న సురేశ్‌తో నరేందర్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు బుధవారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
వికారాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో 3 గంటల పాటు ఎస్పీ నారాయణ రెడ్డి, ఐజీ సత్యనారాయణ విచారించారు. ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలు పరిగి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, మెతుకు ఆనంద్ పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించారు. పట్నం అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనల దృష్ట్యా వికారాబాద్ శిక్షణా కేంద్రం నుంచి పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పరిగి పోలీస్‌స్టేషన్‌లో మరింత సమాచారం సేకరించిన అనంతరం కొడంగల్‌కు భారీ బందోస్తు మధ్య నరేందర్ రెడ్డిని తీసుకెళ్లారు. అక్కడి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన కోర్టు నరేందర్ రెడ్డికి ఈనెల 27వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. లగచర్ల దాడి కేసులో ఇప్పటి వరకు 21మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు దాడి సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేశ్ పరారీలో ఉన్నాడు. నిందితుడైన సురేశ్‌ను పట్టుకునేందుకు పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
లగచర్ల ఘటనపై రిమాండ్ రిపోర్టులో పోలీసుల కీలక అంశాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన పోలీసులు అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్ సహా ఇతర అధికారులపై కొందరు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, కడా అధికారి వెంకట్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారన్నారు. సురేష్ అనే వ్యక్తి అధికారులను గ్రామంలోకి తీసుకువెళ్లాడన్న పోలీసులు ఇదే సమయంలో వారిపై దాడి సహా వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారన్నారు. ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించిన పోలీసులు, దాడిలో ఉపయోగించిన రాళ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రిమాండ్ రిపోర్టులో 46మందిని నిందితులుగా పేర్కొన్నారు. దాడిలో పాల్గొన్న వారిలో 19 మందికి భూమే లేదని ఐజీ సత్యనారాయణ తెలిపారు.
మాజీ మంత్రుల స్పందన :ఇప్పటికే లగచర్ల గ్రామ సంఘటనలో 57 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి (నవంబర్ 12న) 16 మందిని రిమాండ్‌కు తరలించారు. మరి కొంత మందిని సైతం విచారిస్తున్నట్లు సమాచారం. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనలో సూత్రధారుల కీలక సమాచారం సేకరించారు. మరో వైపు పట్నం మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా ఖండించారు.
"పోలీసుల పల్లెనిద్ర" - ఇక వారికి రాజమండ్రి జైలే
ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదన : పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు సీఎం రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్కు (BRS) ఆపాదించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలతో మాట్లాడిన నేతలను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్కు ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు :ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందని కేటీఆర్ వెల్లడించారు. సీఎం అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్టులు ఎన్నో చూసిందని గుర్తు చేశారు. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామని వెల్లడించారు. పట్నం నరేందర్ రెడ్డి అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు.
'జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధమవుతా' - మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
అక్రమ అరెస్టులు, కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? :పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష సాధించడం సిగ్గుచేటని మండిపడ్డారు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ నిర్మాణం చేపట్టడమేనా ప్రజాపాలన? అర్ధరాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందిచడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి, లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలంటూ హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతి పక్షాల బాధ్యతని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడం రేవంత్ సర్కార్ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. అధికార పార్టీ బాధ్యతని మరిచినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నించడం తప్పా? అంటూ ఎక్స్ వేదికగా సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మరోవైపు పట్నం నరేందర్‌రెడ్డి కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు.
సామాజిక మాధ్యమాల్లో విషం కక్కుతున్న వైఎస్సార్సీపీ మూకలు - జల్లెడ పడుతున్న అధికారులు