BRS- BSP Alliance in Telangana Lok Sabha Polls 2024: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలో ఉండగా ఆ తర్వాత బీజేపీలోకి వలసలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇటీవల వరుసగా నాయకులు గుడ్ బై చెబుతున్నారు. ముఖ్యంగా కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో ఎంపీ అభ్యర్థుల విషయంలో పార్టీ గందరగోళానికి గురవుతోంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తుకు సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఈ రెండు పార్టీలు తాజాగా నిర్ణయించాయి. ఈ క్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BSP Praveen Kumar Meets KCR) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను హైదరాబాద్ నందినగర్ కాలనీలోని ఆయన నివాసంలో కలిశారు. దాదాపు రెండు గంటలపాటు ఇరువురి భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరు పార్టీలు పొత్తుపై చర్చించాయి.
భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్, ప్రవీణ్ కుమార్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీఎస్పీతో పొత్తుపై చర్చించామని, ఇరు పార్టీల మధ్య గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని ప్రకటించారు. పొత్తు విధివిధానాలు, సీట్ల ఖరారుపై త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.