Santhabommali Boy Organ Donation : కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం అని వింటూనే ఉంటాం. పుట్టడం, గిట్టడం ఏ ఒక్కరి చేతిలో ఉండేవి కావు. కానీ మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదించడం ఒక గొప్ప కార్యంగా చెప్పవచ్చు. మట్టిలో కలిసే అవయవాలు మరో మనిషి శరీరంలోకి వెళ్లి అవి నిత్య చేతనంగా నిలుస్తాయి. ఇది గ్రహించిన కొందరు తమవారు మరణించినా పరుల మేలు ఆలోచించి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు.
తాజాగా ఆట పాటలతో అల్లరి చేష్టలతో సందడి చేసే ఆ బాలుడు అందనంత దూరాలకు వెళ్లిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు ఇక లేడని తెలిసి ఆ కన్నోళ్లు గుండెలవిసేలా రోదించారు. ఆ బాధను దిగమింగుకొని అవయవదానానికి అంగీకరించారు. పుట్టెడు దుఃఖంలోనూ తమ బిడ్డ మరో ఐదుగురికి పునర్జన్మ ప్రసాదిస్తే చాలంటూ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళంలోని జిల్లాలో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన వాతాడ చిరంజీవులు, రోజా దంపతులకు ఇద్దరు కుమారులు. ఆరో తరగతి చదువుతున్న చిన్న కుమారుడు యువంత్ పుట్టినరోజు వేడుకలు గత నెల జనవరి 29న నిర్వహించారు. ఆ మరుసటి రోజు కళ్లు తిరిగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు చిన్న సమస్యగా భావించి స్థానిక వైద్యుడిని సంప్రదించారు. ప్రాథమిక చికిత్స చేసినా తగ్గలేదు.
Organ Donation in Srikakulam : శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేదు. అనంతరం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి బాలుడు గులియన్ బ్యారీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స అందించి పంపించారు. మళ్లీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో రాగోలు జెమ్స్ ఆసుపత్రికి ఈనెల 4న తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు శ్రమించినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో వైద్యుల బృందం యువంత్ బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.