Nandikotkur Inter Student Incident :నంద్యాల జిల్లా నందికొట్కూరులో సోమవారం తెల్లవారుజామున ఇంటర్మీడియట్ విద్యార్థిని సజీవ దహనం అయిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఆ సమయంలో బాలిక గదిలోనే ఉన్న ఓ యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు కథనం మేరకు ఆమె తల్లిదండ్రులు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెందినవారు. ఏకైక కుమార్తె. బాలిక మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే తండ్రి ఆత్మహత్య చేసుకోగా, తల్లి బాగోగులు చూసుకుంటున్నారు.
తమ స్వగ్రామంలో ఇంటర్మీడియెట్ కోర్సు లేకపోవడంతో కుమార్తెను నందికొట్కూరులోని తన తల్లిదండ్రులు ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. విద్యార్థిని వెల్దుర్తి మండలానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడితో గతంలో పరిచయం ఉంది. పదో తరగతితో చదువు మానేసిన ఆ యువకుడు 2 నెలల కిందట బాలిక కోసం నందికొట్కూరులోని వారింటికి వచ్చాడు. బాలికతో చాలా సేపు మాట్లాడాడు. ఈ విషయం తెలిసిన బాలిక అమ్మమ్మ, తాతయ్యలు ఆ యువకుడిని హెచ్చరించారు. తాను బాలిక కంటే సంవత్సరం సీనియర్ అని, తాము స్నేహితులం మాత్రమేనని రాఘవేంద్ర వారికి చెప్పి వెళ్లిపోయాడు.
ఎవరు గడియ పెట్టి ఉంటారు? : బాలిక అమ్మమ్మ, తాతయ్య ఇంటికి ఆనుకొని, ముందు భాగంలో చిన్న గది ఉండగా, దాన్ని స్టోర్‌రూంగా ఉపయోగిస్తున్నారు. విద్యార్థిని అప్పుడప్పుడు ఆ గదిలో కూర్చొని చదువుకునేది. సోమవారం తెల్లవారుజామున కూడా చదువుకుంటానని ఇంట్లోంచి ఆ గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో నిద్రలేచిన అమ్మమ్మ, మనవరాలు ఆ గదిలోకి వెళ్లాక ఇంటి తలుపు వేసుకుని నిద్రపోయారు. గంట తరువాత భారీ శబ్దం రావడంతో తాతయ్య, అమ్మమ్మ ఇంటి బయటకు వచ్చి చూస్తే, ఆ గది నుంచి పొగలు వస్తున్నాయి. గది లోపలి నుంచి తలుపులు కొడుతున్న శబ్దాలు వినిపించాయి. వారు బయటి నుంచి తలుపులు తీయగా, రాఘవేంద్ర కాలిన గాయాలతో బయటకు వచ్చి, కింద పడిపోయాడు. బాలిక శరీరం అప్పటికే చాలా వరకు కాలిపోయి మృతి చెందింది. తల భాగం గుర్తుపట్టలేనంతగా మాడిపోయింది. రాఘవేంద్రను తొలుత నంద్యాల జీజీహెచ్‌కు, తరువాత కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. అతని శరీరం 80 % కాలిపోయిందని, మాట్లాడే స్థితిలో లేడని వైద్యులు తెలిపారు.