Borugadda Anil Shifted to Rajahmundry Central Jail:రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను పోలీసులు తరలించారు. తుళ్లూరు పరిధిలో బోరుగడ్డ అనిల్ కుమార్‌పై నమోదైన కేసులలో ఆయన్ను విచారించేందుకు పోలీసులు కస్టడీ కోరారు. ఈ క్రమంలో న్యాయస్థానం అనిల్ కుమార్‌ను రెండు రోజుల కస్టడికీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తుళ్లూరు పోలీసులు రెండు రోజులు అనిల్‌ను విచారించారు.
తొలి రోజు ఈ ఏడాది మార్చిలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌పై దాడి కేసు, ఎన్నికల సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన కేసులో పోలీసులు అనిల్‌ను విచారించారు. రెండో రోజూ పోలీసులు అడిగిన ప్రశ్నలకు అనిల్ తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలనే ఇచ్చినట్లు తెలిసింది. అనారోగ్యం సాకుతో విచారణను తప్పించుకునేందుకు అనిల్ కుమార్ వేసిన పాచికలు చెల్లలేదు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటూ వైద్యులు చెప్పడంతో పోలీసులు విచారణ నిమిత్తం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి తుళ్లూరు తీసుకొచ్చారు. విచారణ ముగిసిన అనంతరం అనిల్‌ను మంగళగిరి న్యాయస్థానంలో పోలీసులు హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకెళ్లారు.