ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విమానాలకు మళ్లీ బాంబు బెదిరింపులు - ప్రయాణికులను దింపేసి తనిఖీలు - BOMB THREATS TO PLANES

ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు ట్వీట్‌ - రీజినల్ ఆఫీస్‌ నుంచి అందిన సమాచారం

Bomb_Threats_to_Planes
Bomb Threats to Planes (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2024, 7:42 PM IST

Updated : Oct 29, 2024, 8:40 PM IST

Bomb Threats to Planes : విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు ట్వీట్‌ పెట్టారు. బాంబు బెదిరింపు ట్వీట్‌పై ఇండిగో రీజినల్ ఆఫీస్‌ నుంచి సమాచారం వచ్చింది. బాంబుపై విశాఖ ఇండిగో ఎయిర్‌లైన్స్ స్టేషన్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. ఆడమ్ లామ్‌జా 202 ఐడీ నుంచి ట్వీట్ వచ్చినట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. చెన్నై-విశాఖ, బెంగళూరు-విశాఖ ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు ట్వీట్‌ వచ్చినట్లు తెలిపారు.

మంగళవారం సాయంత్రం 5 గంటల 38 నిమిషాలకు ఫోన్ కాల్ వచ్చినట్టు నిర్ధారించారు. అప్పటికే ఈ విమానాలు విశాఖలో సురక్షితంగా లాండ్ అయ్యాయి. బాంబు బెదిరింపుతో తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న చెన్నై- విశాఖ, బెంగళూరు-విశాఖ ఇండిగో విమానాలలోని ప్రయాణీకులందరినీ దింపేసి తనిఖీలు చేపట్టారు. ఐసోలేషన్ బేకి తరలించి తనిఖీలు నిర్వహించారు. దాదాపు రెండు గంటల తర్వాత అందులో వాస్తవం లేదని అధికారులు తేల్చారు. దీని కారణంగా 5 గంటల 50 నిమిషాలకు బయలుదేరాల్సిన చెన్నై విమానం, 6 గంటల 25 నిమిషాలకు బయలుదేరాల్సిన బెంగళూరు విమానం దాదాపు రెండు గంటలకుపైగా అలస్యంగా బయలుదేరాయి.

వరుస బెదిరింపులు: దేశంలో విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. సోమవారం సైతం హైదరాబాద్ - విశాఖ - ముంబై విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్​లు విస్తృతంగా తనిఖీలు చేసి, చివరకు అందులో బాంబు లేదని నిర్ధారించారు. బాంబు బెదిరింపులు కారణంగా దాదాపు మూడున్నర గంటల అలస్యంగా విమానాన్ని ముంబై వెళ్లేందుకు సిద్దం చేశారు.

సోమవారం మధ్యాహ్నం 2.45కి హైదరాబాద్ నుంచి విశాఖకు ఇండిగో విమానం చేరుకుంది. తిరిగి యథావిధిగా నిర్ణీత సమయానికి తిరిగి ముంబై పయనమైంది. అయితే ఇదే సమయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక అగంతకుడు ఫోన్ చేసి హైదరాబాద్- విశాఖ - ముంబై విమానంలో బాంబు ఉందని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే విశాఖ నుంచి టేకాఫ్ అయి ముంబైకి పయనమై 10 నిమిషాలకు పైగా అయినప్పటికి తిరిగి దానిని వెనక్కి రప్పించారు. ప్రయాణికులందరిని దింపేసి క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని నిర్దారించారు.

బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని విమాన ప్రయాణాలు చేయకుండా నిషేధం విధిస్తామని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోందని రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

మరోవైపు దేశంలో పలు విమానాలకు బాంబు బెదిరింపు సందేశాలు పంపిన వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. నాగ్‌పుర్‌లోని గోండియాకు చెందిన జగదీశ్‌ యూకీ అనే వ్యక్తి ఇ-మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుడు ప్రధాని కార్యాలయం, రైల్వేమంత్రి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, పలు ఎయిర్‌లైన్స్‌ కార్యాలయాలు, డీజీపీలు, ఆర్‌పీఎఫ్‌తోసహా పలు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా బెదిరింపు సందేశాలు పంపినట్లు వెల్లడించారు. ఉగ్రవాదంపై ఓ పుస్తకం రాసిన నిందితుడు, ఈ విషయమై ప్రధాని మోదీతో సమావేశం కావాలని ఈ-మెయిల్స్‌లో అభ్యర్థించినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు జరుపుతున్నట్లు చెప్పారు.

'విశాఖ- ముంబై' విమానానికి బాంబు బెదిరింపు - వెనక్కి రప్పించిన సిబ్బంది

Last Updated : Oct 29, 2024, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details