MLA Parthasarathi Valmiki Cleaned Drainage Canals in Kurnool District :సాధారణంగా ఎమ్మెల్యే అంటే ఏసీ కార్లలో తిరగటం, సమావేశాలకు హాజరు కావటం చూస్తూటం. మరికొందరు ప్రత్యర్ధులు, అధికారులుపై బెదిరింపులకు దిగుతూ పనులను చేయించుకుంటారు. కానీ ఎమ్మెల్యేనే స్వయంగా పార చేతబట్టి మురుగు కాలువలను శుభ్రం చేయటం ఎక్కడైనా చూశారా? అవునండీ మీరు వింటున్నది నిజమే కూటమి ఎమ్మెల్యే పార్ధసారథి వాల్మీకి పారతో మురుగు కాలువల్లో పూడిక తీసి, శుభ్రం చేశారు. దీంతో ఆ గ్రామస్థుల ప్రశంసలు అందుకున్నారు.
పారిశుద్ధ్య కార్మికుడిగా ఎమ్మెల్యే : కర్నూలు జిల్లా ఆదోని మండలం దిబ్బనకల్లో కూటమి బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారథి వాల్మీకి పర్యటించారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్థులు ఎమ్మెల్యే వద్ద తమ ఇబ్బందులను వెల్లడించారు. "గ్రామంలో చాలా రోజులుగా మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదు. దుర్వాసన వస్తోంది. దోమలతో రోగాల బారిన పడుతున్నాం" అని ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. పార చేతబట్టి మురుగు కాలువల్లో పూడిక తీసి, శుభ్రం చేశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వేతనాలు ఇవ్వలేదని పంచాయతీ కార్మికులు తెలుపగా 'నాకు ప్రభుత్వం ఇచ్చే వేతనంలోంచి చెల్లిస్తా' అని భరోసా ఇచ్చారు. ఇకపై పారిశుద్ధ్య పనులు ఆపొద్దని అధికారులను సూచించారు.