Bhogi Festival 2025: సంక్రాంతి పండుగ ప్రారంభమయ్యేదే భోగి మంటలతో. పది రోజుల ముందు నుంచే చిన్నా, పెద్దా అంతా కలసి ఆవుపేడతో పిడకల తయారీలో నిమగ్నమవుతారు. భోగి పండుగ రోజు ఊరంతా ఒక్కచోట చేరి తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు వేసి సందడి చేస్తారు. అయితే ఏపీలోని పలు గ్రామాల్లో భోగి, సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం.
బోనాలతో సంక్రాంతి:పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం మిర్తివలసలో సంక్రాంతిని తెలంగాణ పద్ధతిలో బోనాలతో జరుపుకుంటారు. పసుపు, కుంకుమలతో బోనాలను అలంకరించి, పూజలు చేసి ప్రసాదాలను వాటిల్లో ఉంచుతారు. తర్వాత తలపై పెట్టుకొని గ్రామ శివారులోని వెంకమ్మ పేరంటాల గుడిలో బోనాలను సమర్పిస్తారు. పురుషులు చేతిలో కత్తులు పట్టుకుని, పంచె కట్టుతో ముందు నడుస్తూ వెళ్తుంటారు. దీనిని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తరలివస్తారు.
పిల్లి పండుగ ప్రత్యేకం:పార్వతీపురం మండలంలోని నర్సిపురంలో కనుమను శివాలయం వద్ద ఉన్న ఓ గ్రౌండ్లో నిర్వహిస్తారు. తాళ్లబురిడిలో వింజమ్మ కొండపైకి ప్రజలు చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. రావికోన పంచాయతీ అడ్డూరివలసలో పిల్లి పండుగ పేరుతో నిర్వహిస్తారు. దీనిని పాండవుల పండుగ అని కూడా పిలుస్తారు. ఓ తట్టలో పిల్లాడిని పెట్టి చుట్టూ ఆకులు చుట్టి గ్రామంలో ఊరేగిస్తారు. ఆ పిల్లడు ఎటుదిగితే అటుగా అటవీ ఉత్పత్తుల సేకరణ, జంతు వేటను ప్రారంభిస్తారు.