Bhavanis Initiation Ceremony At Vijayawada Kanaka durga Temple :నేటి (డిసెంబరు 21) నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీల విరమణ దీక్షలు ఆరంభం కానున్నాయి. నుంచి 25 వరకు ఐదు రోజులు జరిగే భవానీ దీక్ష విరమణ వేడుకలకు అధికారులు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేశారు. నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 50 వేల నుంచి లక్ష మంది భవానీలు మొదటి మూడు రోజులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రెండు రోజుల్లో రోజుకు లక్ష నుంచి రెండు లక్షల మంది వరకూ భవానీలు వచ్చే అవకాశం ఉందని అంచనా.
దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు మాట్లాడుతూ భవానీల దీక్షల విరమణ, అమ్మవారి దర్శనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. తొలిరోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. రెండో రోజు నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 వరకూ దర్శనాలకు అనుమతిస్తారు.
5 క్యూలైన్లు :ఇంద్రకీలాద్రి కొండ దిగువన వినాయక గుడి నుంచి ఓం టర్నింగ్ వరకూ మూడు క్యూలైన్లు వేశారు. ఓం టర్నింగ్ వద్ద నుంచి ఐదు లైన్లుగా భక్తులు దర్శనాలకు వెళ్తారు. వీటిలో రూ.500, రూ.300, రూ.100 టికెట్ల క్యూలైన్లు మూడు, మిగతా రెండు ఉచిత దర్శన లైన్లు ఉంటాయి. భక్తులు అమ్మవారి దర్శనం అనంతరం శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు దిగిపోతారు. అక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.