INTERNATIONAL DAY OF THE GIRL CHILD :'ఎగిరిపోవే రామచిలుకా... ఆడపిల్లవు కాదుగనకా' ఆడపిల్లలపై అడుగడుగునా ఉన్న ఆంక్షల గురించి అని ఓ సినీ కవి ఆవేదన ఇది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. గర్భంలోనే చిదిమేస్తున్నారు కొంతమంది. ఇక పుట్టిన బిడ్డ ఆడపిల్ల అయితే చెత్త కుప్పల్లోనో, వీధుల్లోనో వదిలేసి వెళ్తున్నారు మరికొంత మంది. ఇలా ఆడపిల్ల పుట్టడమే నేరమైతే.. పుట్టిన వాళ్లు కూడా అడుగడుగునా వేధింపులకు గురవుతున్న దుస్థితి.
- విజయనగరం జిల్లాలో అప్పుడే పుట్టిన పసికందు రోడ్డు పక్కన పొదల్లో రోదిస్తూ కనిపించింది. ఆడపిల్ల కావడంతోనే వదిలేశారని అధికారుల విచారణలో తేలింది.
- కదిరి ఆర్టీసీ బస్టాండులో మరో మహిళ ఐదునెలల పసికందును వదిలేసి వెళ్లింది. ఆ కేసు విచారణలో ఉంది.
- విజయవాడలో సుబ్రమణ్యం అనే కామాంధుడు బాలికపై లైంగిక దాడికి యత్నించగా దసరా బందోబస్తుకు వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
- ప్రకాశం జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
- బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కనగాలలో ప్రేమోన్మాది బరితెగించాడు. ప్రేమను అంగీకరించడం లేదంటూ ఇంటికెళ్లి మరీ చాకుతో దాడికి తెగబడ్డాడు.
పుట్టడానికే పెద్ద పోరాటం తప్పని నేటి సమాజంలో ఇంటా, బయటా, పాఠశాలలు, కళాశాలల్లో బాలికలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. "ఇంటికి వెలుగు, కంటికి దీపం" అంటున్న ఈ సమాజంలో వారి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. ఆడపిల్లలను కాపాడుకోవడం పెను సవాల్‌గా మారిపోయింది. మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
బాలికలపై అత్యాచారాలు, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలిపేందుకు ఐక్యరాజ్యసమితి అక్టోబరు 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ప్రకటించింది. నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక కథనం.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గర్భస్థ లింగ నిర్ధరణ పరీక్షలు అక్కడక్కడా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్నాయి. ఆడపిల్ల పుడుతుందని నిర్ధారించుకుంటున్న కొంతమంది తల్లిదండ్రులు గర్భంలో లేదంటే పురిట్లోనో చిదిమేస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ విష సంస్కృతి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించడం ప్రమాదకరంగా పరిణమించింది. ఆడపిల్లలను కాపాడుకోడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేస్తున్నా మార్పు కనిపించడం లేదు. అనకాపల్లి జిల్లాలో బాల, బాలికల నిష్పత్తి 1000 : 985 అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.