Beneficiaries hopes for 4 welfare schemes : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 4 సంక్షేమ పథకాల లబ్ధి తమకు ఎప్పుడు దక్కుతుందోనని అర్హులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మండలానికో పంచాయతీని ఎంపిక చేసి, గణతంత్ర దినోత్సవం రోజు (జనవరి26)న లబ్ధిదారులకు మంజూరు చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్కరి అకౌంట్లో రూ.6 వేల చొప్పున నిధులు విడుదల చేశారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారి జాబితాలను ప్రకటించగా, రానివారు దరఖాస్తులు చేశారు. ఆ వివరాలను ప్రస్తుతం అంతర్జాలంలో ఎంటర్ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ పథకాల అమల్లో ఏమైనా జాప్యం జరుగుతుందా అనే చర్చ మొదలైంది. ఎన్నికల కోడ్ రాక ముందే పథకాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి ఆటంకం ఉండదని గతంలో ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు చెబుతున్నారు.
మండలానికి ఒకటి చొప్పున :కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోమండలానికి ఒకటి చొప్పున 15 పంచాయతీల్లోని 19 గ్రామాల్లో 4 పథకాలను అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. రైతు భరోసా పథకానికి సంబంధించి 4,963 మంది రైతులను ఎంపిక చేశారు. కానీ 4,344 మంది అకౌంట్లలో రూ.6 వేల చొప్పున రూ.8.26 కోట్లను విడుదల చేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 400 మందిని ఎంపిక చేసినప్పటికీ ఎంతమందికి నిధులు జమయ్యాయో వివరాలు లేవు. 573 మందికి రేషన్ కార్డులను మంజూరు చేశారు. వీరికి బియ్యం ఎప్పటి నుంచి ఇస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. 2,124 మందికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంజూరు పత్రాలు అందించారు.