Bejawada People Facing Serious Drainage Problems :మురుగు కాలువల సమస్యలతో బెజవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త తొలగించడం లేదని స్థానికులు చెబుతున్నారు. నగరపాలక సంస్థలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ పాలక మండలి పారిశుద్ధ్య సమస్యను పట్టించుకోకపోవడంతో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పారిశుద్ధ్యంలో విజయవాడ నగరం దేశంలోనే ఐదో స్థానంలో ఉందని వీఎంసీ (VMC) పాలక పక్షం గొప్పలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. కేంద్రం నిధులతో చేపట్టిన డ్రైనేజీ పనుల్లో ఐదేళ్లపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
'విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 1.01 లక్షల ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఉండగా 1.09 లక్షల ఇళ్లకు కనెక్షన్లే లేవు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను వీఎంసీ (VMC) సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించకపోవటంతో మురుగు పేరుకుపోతోంది. దీంతో చిన్నపాటి వర్షానికే పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. బందరు రోడ్డు, ఏలూరు రోడ్లపై భారీ స్థాయిలో నీరు నిలిచిపోతోంది. బహిరంగ ప్రదేశాలు, కాలువల్లో చిరు వ్యాపారులు చెత్తవేయడాన్ని అధికారులు నియంత్రించటం లేదు.' -కోనేరు శ్రీధర్, వీఎంసీ మాజీ మేయర్, సురేశ్, స్థానికుడు